Machilipatnam Local News : విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం-మంత్రి కొల్లు రవీంద్ర

Sharat
1 View

మచిలీపట్నం :– విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

మచిలీపట్నం మండలం తాళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులకు పాదపూజ నిర్వహించి అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసి వారి అభిప్రాయాలు, విద్యా అవసరాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు కోసం అనేక వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల అభివృద్ధి కమిటీలు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల చదువు, క్రమశిక్షణ, హాజరు, పాఠశాల అవసరాలు, మౌలిక వసతులపై నిరంతర సమీక్ష నిర్వహించే అవకాశం లభిస్తుందన్నారు.

ప్రపంచంలోనే ఒకే రోజు కోట్లాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనే స్థాయిలో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగి, పదో తరగతి ఉత్తీర్ణత శాతం కూడా గణనీయంగా మెరుగుపడిందని చెప్పారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం, గుడ్లు, చికెన్‌తో కూడిన పోషకాహార మెనూను అందిస్తున్నామని, యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, బ్యాగులు తదితర అవసరాలను సకాలంలో అందజేస్తున్నామని తెలిపారు.

విద్యారంగానికి ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం “తల్లికి వందనం” పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా పారదర్శకంగా 16,300 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం అవసరాన్ని బట్టి మరిన్ని నియామకాలు కూడా చేపడుతుందని వెల్లడించారు.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, పోర్టులు, పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో యువతకు రాష్ట్రంలోనే విస్తృత ఉద్యోగ అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు.

ఆడపిల్లల విద్యకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, బాలికల చదువును మధ్యలో నిలిపివేయకుండా ఉన్నత విద్య వరకు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, శానిటరీ నాప్‌కిన్లు వంటి సౌకర్యాలపై తల్లిదండ్రులు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయమే విద్యార్థుల విజయానికి పునాది: కొనకళ్ల నారాయణరావు

ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం అత్యంత అవసరమన్నారు. విద్యార్థుల బలాలు, బలహీనతలను కలిసి విశ్లేషించి తగిన మార్గదర్శకత్వం అందించడమే మెగా పీటీఎం లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, డిజిటల్ విద్య, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం వంటి చర్యలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగి విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయని తెలిపారు.

విద్యార్థుల అభివృద్ధిలో కుటుంబం కూడా భాగస్వామ్యం కావాలి: జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్

జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాన బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలు, విలువల పెంపొందింపుపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా పిల్లల ప్రతిభను అంచనా వేసి ఉపాధ్యాయులతో చర్చించాలని తల్లిదండ్రులకు సూచించారు.

పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని, క్రీడలు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. సెల్‌ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లల్లో పుస్తక పఠన అలవాటు పెంపొందించాలని సూచించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితాలను ఆదర్శంగా తీసుకుని పిల్లల్లో విలువలు, నిజాయితీ, దేశభక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గత పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 547 మార్కులు సాధించిన పూర్వ విద్యార్థిని మైలపల్లి లుథియాను అతిథులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముందు జాయింట్ కలెక్టర్ 7, 9, 10వ తరగతుల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు, మండల విద్యాధికారి ప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు ఎం. జ్యోత్స్న దేవి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జి. రామ లక్ష్మణరావు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, గోపు సత్యనారాయణ, గుమ్మడి విద్యాసాగర్, మన్నె వెంకటేశ్వరరావు, జొన్న బాబురావు, జొన్న ప్రసాద్, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review