అమరావతి, సెప్టెంబర్ 15: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వైసీపీ, సాక్షి తప్పుడు కథనాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎనిమిదేళ్లుగా వెటర్నరీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకే 160 వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రస్తుతం సుమారు 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతలో 160 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే నియామక ప్రక్రియపై అనుమానాలు సృష్టిస్తూ కథనాలు ప్రచురించడం సరికాదన్నారు.Amaravathi city news
పాత విధానంలోనే మెరిట్, వెయిటేజీ
వెటర్నరీ డాక్టర్ల నియామకాలకు సంబంధించి 28.10.2016న జారీ చేసిన G.O.Ms.No.52లో మెరిట్, వెయిటేజీ విధానం స్పష్టంగా ఉందని మంత్రి తెలిపారు. మొత్తం 100 మార్కులకు అభ్యర్థుల మెరిట్‌ను నిర్ణయించే విధానం అమల్లో ఉందన్నారు. BVSc మార్కులకు 60, MVSc అర్హతకు 10, ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో కాంట్రాక్ట్ సేవలకు 10, గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి సీనియారిటీకి సంవత్సరానికి నాలుగు మార్కుల చొప్పున గరిష్ఠంగా 20 మార్కులు కేటాయించే విధానం ఉందని వివరించారు.
వైద్య ఆరోగ్య శాఖలో వైద్యుల నియామకాల్లోనూ ఇలాంటి వెయిటేజీ విధానం అమల్లో ఉందని తెలిపారు.
అభ్యర్థుల విజ్ఞప్తి మేరకే నిర్ణయం
జాబ్ క్యాలెండర్‌లో భాగంగా G.O.Ms.No.21 ద్వారా వెటర్నరీ డాక్టర్ పోస్టులను APPSC ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించిందని అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే గత ఎనిమిదేళ్లుగా నియామకాలు జరగకపోవడంతో, అకస్మాత్తుగా పరీక్షా విధానం అమలు చేస్తే ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని వెటర్నరీ నిరుద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరిందన్నారు.
ఈ ఒక్కసారికి పాత వెయిటేజీ విధానాన్ని కొనసాగించాలని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలించిందని తెలిపారు. అభ్యర్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని G.O.Ms.No.52 ప్రకారం పరీక్ష లేకుండా మెరిట్, వెయిటేజీ ఆధారంగా నియామకాలు చేపట్టాలని APPSCని ప్రభుత్వం కోరిందన్నారు.
అయితే ప్రస్తుత పని ఒత్తిడి కారణంగా పరీక్ష లేకుండా వెయిటేజీ విధానంలో నియామకాలు నిర్వహించేందుకు అవసరమైన సమయం లేదని APPSC తెలిపిందని చెప్పారు. దీంతో G.O.Ms.No.22 ద్వారా ఈ ఒక్కసారికి మాత్రమే పాత విధానంలో పశుసంవర్ధక శాఖ ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.
భవిష్యత్తులో వెటర్నరీ డాక్టర్ పోస్టుల నియామకాలు APPSC ద్వారా పరీక్షా విధానంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.
సాక్షి కథనంపై మంత్రి విమర్శలు
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ విషయంలో సాక్షి కథనంలో తప్పు సమాచారం ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రస్తుతం దామోదర్ నాయుడు డైరెక్టర్‌గా లేరని, ఒక మహిళా అధికారి ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
శాఖలో ప్రస్తుతం ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారనే కనీస వివరాలు తెలుసుకోకుండా కథనం రాయడం జర్నలిజం కాదని విమర్శించారు. వాస్తవాలను పరిశీలించకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఉద్యోగాల కల్పన ప్రభుత్వ విధానం
ఎనిమిదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు చివరిసారిగా పాత విధానంలో అవకాశం కల్పిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ తర్వాత నియామకాలు APPSC పరీక్షా విధానంలోనే జరుగుతాయని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే నియామక ప్రక్రియను వివాదాస్పదం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు. నిరుద్యోగుల భవిష్యత్తును రాజకీయ అంశంగా మార్చకూడదన్నారు.
ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వ విధానమని, ఉద్యోగాలకు అడ్డుపడటం వైసీపీ విధానమని అచ్చెన్నాయుడు విమర్శించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.



