అమరావతి, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2029 నాటికి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందించేలా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్, పీఎం జన్‌మన్ సహా వివిధ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. వచ్చే నెలలోగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా 1.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.Amaravathi Local News
డిసెంబర్ 2026 నాటికి 2.05 లక్షల ఇళ్లను, 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
18.72 లక్షల ఇళ్లకు మంజూరు
పీఎంఏవై 1.0, పీఎంఏవై 2.0, పీఎం జన్‌మన్ పథకాల కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 18.72 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటిలో 13.20 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 16.11 లక్షల ఇళ్లకు గాను 11.31 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఏపీ టిడ్కో పరిధిలో 2.61 లక్షల ఇళ్లకు గాను 1.88 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
2027 డిసెంబర్ నాటికి మరో 75 వేల కొత్త ఇళ్లకు మంజూరు లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు 1.5 లక్షల ఇళ్లను పైప్‌లైన్‌లోకి తీసుకురావాలని సీఎం సూచించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన నిధులు, కేటాయింపులు పొందాలని ఆదేశించారు.
ఉచిత ఇళ్ల స్థలాలపై ప్రత్యేక కార్యాచరణ
ఇంటి స్థలం లేని కుటుంబాల వాస్తవ డిమాండ్‌ను గుర్తించేందుకు ఆర్టీజీఎస్, ఆవాస్ ప్లస్, హౌసింగ్, రెవెన్యూ శాఖల డేటాను అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. డూప్లికేషన్ లేకుండా అర్హులను గుర్తించి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని ఆదేశించారు.
గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రాథమిక లబ్ధిదారుల జాబితాలను ప్రకటించి, అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించిన అనంతరం తుది జాబితాలను ఖరారు చేయాలని సూచించారు. ఇప్పటికే ఉన్న లే అవుట్లలో నిర్మాణాలు చేపట్టని భూమిని అవసరానికి అనుగుణంగా 2 లేదా 3 సెంట్ల ప్లాట్లుగా పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించారు.
ఖాళీ స్థలాలను గుర్తించడం, అర్హులైన లబ్ధిదారులకు వాటిని మ్యాపింగ్ చేయడం, నిర్మాణం పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలోనూ సాచురేషన్ విధానంలో గృహ నిర్మాణం చేపట్టాలని సూచించారు.
పారిశ్రామిక ప్రాంతాల్లో టౌన్‌షిప్‌లు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక టౌన్‌షిప్‌ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీసిటీతో పాటు ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని పారిశ్రామిక టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. 2029 నాటికి రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అందరికీ ఇళ్లు లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, హౌసింగ్ శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



