Visakha city news :ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష

Sharat
1 View

విశాఖపట్నం, జూలై 30:– ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలో జరగనున్న పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, అధికారుల సమన్వయంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశంలో రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు కూడా సమావేశంలో పాల్గొని తమ తమ జిల్లాల్లో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు.

ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలపై ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా సమర్థవంతంగా నిర్వహణ చేపట్టడంతో పాటు పోలీసు, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, ప్రత్యేక భద్రతా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ప్రధాని మోదీ పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపడుతోందని హోం మంత్రి పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా పర్యటన విజయవంతమయ్యేలా అధికారులు కృషి చేయాలని ఆమె స్పష్టం చేశారు.

Author
Share This Article
Leave a review