Hyderabad city news :గాండ్ల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి-వర్కింగ్ ప్రెసిడెంట్ అమనగంటి శ్రీనివాస్

Sharat
1 View

Hyderabad:-ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన గాండ్ల కులస్తుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 కోట్ల నిధులు కేటాయించాలని అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడు అసోల్ల రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అమనగంటి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం సంఘం ప్రతినిధి ముత్తుమల్ల రామచంద్రం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్ష, కార్యదర్శులను ఘనంగా సన్మానించారు.

సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా గాండ్ల కులస్తులు ఉన్నారని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కులవృత్తిని కొనసాగించేందుకు యువతకు సబ్సిడీపై అవసరమైన యంత్రాలను అందించాలని కోరారు.

గానుగ నూనెకు ప్రోత్సాహం కల్పించేలా రాష్ట్రంలోని దేవాలయాల్లో గానుగ నూనెను వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గాండ్ల కులస్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారి సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు నూతన వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

గాండ్ల కులస్తులను చిన్నచూపు చూస్తే సహించేది లేదని సంఘం నాయకులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా నూతన కమిటీలను ఏర్పాటు చేసి గాండ్ల కులస్తులను చైతన్యవంతం చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 22 జిల్లాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గాండ్ల కులస్తుల సంక్షేమం, హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

Author
Share This Article
Leave a review