మంగళగిరి:– పేదలు, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో ఆదివారం నిర్వహించిన మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
2014 నుంచి 2024 వరకు మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉందని అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి గతంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకత్వం అనేక కుతంత్రాలతో అధికారంలోకి వచ్చిందని అయోధ్య రామిరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత బయటపడుతుందని అన్నారు.Guntur Distric News
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణుల మధ్య సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, శాసన మండలి సభ్యుడు మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పలువురు స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



