Amaravathi news :గ్రూప్‌–1 పరీక్షలో గత ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Sharat
1 View

అమరావతి, ఆగస్టు 19: గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన అధికారుల ఎంపిక ప్రక్రియలోనే అవకతవకలు జరగడం దురదృష్టకరమన్నారు. గ్రూప్‌–1 జవాబు పత్రాల మూల్యాంకనాన్ని అర్హత లేని ప్రైవేటు వ్యక్తులతో చేయించారని, అభ్యర్థుల పేపర్లు అనధికార వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని తెలిపారు.

శాసనసభలో నిబంధన 344 కింద జరిగిన ప్రత్యేక చర్చలో ముఖ్యమంత్రి ఈ అంశాలను ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 315 ప్రకారం ఏర్పడిన ఏపీపీఎస్సీ రాష్ట్రానికి అత్యంత కీలకమైన సంస్థ అని, దాని విశ్వసనీయతను దెబ్బతీసేలా గత పాలకులు వ్యవహరించారని విమర్శించారు. గత ప్రభుత్వంలో సీఎం సీట్లో కూర్చుని తప్పులు చేసిన వ్యక్తి వాటిపై సమాధానం చెప్పేందుకు నేడు సభకు రాకపోవడం బాధ్యతారాహిత్యమని చంద్రబాబు అన్నారు.

కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని ఆరోపణ

2018లో జారీ చేసిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌కు 1.14 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 325 మందిని షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు సీఎం తెలిపారు. పరీక్షల నిర్వహణలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పదో తరగతి జవాబు పత్రాలను సైతం పోలీసు ఎస్కార్ట్‌తో తరలించే పరిస్థితుల్లో గ్రూప్‌–1 పేపర్లను మాత్రం నిర్లక్ష్యంగా నిర్వహించారని విమర్శించారు.

డిజిటల్‌ మూల్యాంకనాన్ని పక్కనపెట్టి మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌ చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, కోర్టును తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు దాఖలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే హాయ్‌లాండ్‌లో మూల్యాంకనానికి రూ.1.19 కోట్ల విలువైన పనులకు ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. మరోవైపు కోర్టు ఆదేశాలు అమల్లో ఉండగానే ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు.

అర్హత లేని వారితో జవాబు పత్రాల మూల్యాంకనం

గ్రూప్‌–1 వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాల పరీక్ష పత్రాలను విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీలు వంటి నిపుణులు మూల్యాంకనం చేయాల్సి ఉండగా, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు, గృహిణులు, నిరుద్యోగులు, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్లతో పేపర్లు దిద్దించారని సీఎం ఆరోపించారు.

మొత్తం 158 మందితో ప్యానల్‌ ఏర్పాటు చేసి 72 మందికి మూల్యాంకన బాధ్యతలు అప్పగించగా, వారిలో 25 మంది అనధికారికంగా నియమించినవారేనని తెలిపారు. మరో 66 మంది ఎవాల్యుయేటర్లు కూడా అనధికారికంగా పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేశారని ఆరోపించారు.

అభ్యర్థుల జవాబు పత్రాల పీడీఎఫ్‌లను ప్రైవేటు వ్యక్తుల ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత ఈ-మెయిళ్లు, గూగుల్‌ డ్రైవ్‌, వాట్సప్‌ ద్వారా పంపించారని చంద్రబాబు తెలిపారు. ఏపీపీఎస్సీ స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి జవాబు పత్రాలను అనధికారికంగా తరలించి 84 రోజుల పాటు హాయ్‌లాండ్‌లో ఉంచారని పేర్కొన్నారు. హాయ్‌లాండ్‌లో మూల్యాంకనం జరగలేదని హైకోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చిన సమయంలోనే లాజిస్టిక్స్‌ కోసం రూ.1.14 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

డూప్లికేట్‌ ఓఎంఆర్‌ స్లిప్పులపై అనుమానాలు

కొత్త చైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌కు ఆదేశాలు ఇచ్చారని సీఎం తెలిపారు. 49 వేల డూప్లికేట్‌ ఓఎంఆర్‌ స్లిప్‌లు ముద్రించినట్లు చెప్పారు. జవాబు పత్రాల్లో వేర్వేరు రాతలు, మార్పులు, చేర్పులు, ఓవర్‌రైటింగ్‌లు గుర్తించినట్లు వెల్లడించారు.

734 ఓఎంఆర్‌ స్లిప్‌లలో 718 స్లిప్‌లలో మార్పులు జరిగినట్లు తెలిపారు. 21 స్లిప్‌లపై ఎలాంటి సంతకాలు లేకపోవడం అక్రమాల తీవ్రతను సూచిస్తోందన్నారు. గ్రూప్‌–1 పరీక్ష రాసిన అభ్యర్థినే అదే పరీక్షకు ఎవాల్యుయేషన్‌ ఎగ్జామినర్‌గా నియమించడం మరింత తీవ్రమైన అంశమని చంద్రబాబు అన్నారు.

ఎగ్జామినర్ల జాబితాలను వాట్సప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో పెట్టారని, మూల్యాంకనం జరిగిన హాల్లో 17 రోజుల పాటు సీసీ కెమెరాలు లేకపోయాయని తెలిపారు. మొబైల్‌ ఫోన్ల వినియోగానికి కూడా అవకాశం కల్పించారని ఆరోపించారు. ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా ఓఎంఆర్‌ వాల్యుయేషన్‌ స్లిప్‌లలో వైటనర్‌ వినియోగించినట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ నివేదికలు వెల్లడించాయని పేర్కొన్నారు.

ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాం

2019–24 మధ్య రాష్ట్రంలోని వ్యవస్థలను గత ప్రభుత్వం దెబ్బతీసిందని చంద్రబాబు విమర్శించారు. వ్యక్తుల కోసం వ్యవస్థలు ఉండవని, యువత భవిష్యత్తు కోసం వ్యవస్థలు పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలని అన్నారు.

శాసనసభ ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించే వేదిక అని, జరిగిన తప్పులకు సంబంధించి బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్‌–1 పరీక్షల్లో జరిగిన అక్రమాలను పూర్తిగా విశ్లేషించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పారదర్శకమైన మూల్యాంకన విధానం, పటిష్టమైన భద్రతా ప్రమాణాలు తీసుకురావడంతో పాటు ప్రజలు, మేధావుల నుంచి అభిప్రాయాలు సేకరించి సంస్కరణలు చేపడతామని తెలిపారు. తప్పు చేసిన వ్యక్తులు ఎప్పటికైనా బయటపడతారనడానికి గ్రూప్‌–1 పరీక్షల వ్యవహారమే ఉదాహరణగా సీఎం పేర్కొన్నారు.

Author
Share This Article
Leave a review