Amaravathi news :అమరావతి మాస్టర్ ప్లాన్‌పై బోరుపాలెం, దొండపాడులో గ్రామసభలు-గ్రామ రహదారుల ప్రణాళికపై గ్రామస్థుల సూచనలు, అభిప్రాయాల సేకరణ

Sharat
2 Views

అమరావతి:– ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌ల రూపకల్పనపై ఏపీ సీఆర్డీఏ ఆధ్వర్యంలో బోరుపాలెం, దొండపాడు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. నార్త్‌వెస్ట్ గ్రిడ్‌లో భాగమైన ఈ గ్రామాల్లో సోమవారం నిర్వహించిన సమావేశాల్లో గ్రామస్థులకు ప్రతిపాదిత రహదారి నెట్‌వర్క్, భవిష్యత్ మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులు అవగాహన కల్పించారు.

గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న రహదారులను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పీఎస్) జోన్లకు అనుగుణంగా ప్రతిపాదించిన రహదారి నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే విధానాన్ని అధికారులు వివరించారు. గ్రామ రహదారుల ప్రణాళిక, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలను ఏపీ సీఆర్డీఏ ప్లానింగ్ విభాగం అధికారులు ఏ.అజయ్ కుమార్, సీహెచ్. మధుసూధనరావు, సంబంధిత అధికారులు గ్రామస్థులకు వివరించారు.

గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న రహదారులు, వాటి అనుసంధానంపై సమగ్ర సమాచారం సేకరించేందుకు గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్యాటర్న్ సర్వే, ఎల్‌పీఎస్ రహదారి నెట్‌వర్క్ సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సర్వే ద్వారా లభించే సమాచారంతో గ్రామ రహదారుల ప్రణాళికను మరింత సమర్థవంతంగా రూపొందించడంతో పాటు భవిష్యత్ మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు.

గ్రామసభల్లో పాల్గొన్న గ్రామస్థులు ప్రతిపాదిత ప్రణాళికలపై తమ సూచనలు, అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్థుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం ఆయా గ్రామాలకు సంబంధించిన గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌లను రూపొందించనున్నట్లు ఏపీ సీఆర్డీఏ అధికారులు తెలిపారు.

Author
Share This Article
Leave a review