అమరావతి: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంపై బీసీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శాసనసభ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఈ నిర్ణయం కీలక ముందడుగని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీలోనూ కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిందని బీసీ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కూటమి పార్టీల సహకారంతో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవికి తొలిసారిగా ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం ద్వారా అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.
అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం కూడా సామాజిక సమతుల్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, బీసీ వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని బీసీ ప్రజాప్రతినిధులు తెలిపారు.
స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుతో బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశం ఏర్పడిందని, గ్రామస్థాయి నుంచి రాజకీయ సాధికారత బలోపేతం అవుతుందని వారు పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.



