మచిలీపట్నం (కృష్ణా జిల్లా): పర్యావరణ పరిరక్షణతో పాటు వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రతి శనివారం సైకిల్‌పై విధులకు హాజరవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అవసరమైన సందర్భాల్లో మాత్రమే మోటారు వాహనాలను వినియోగించాలని ప్రజలకు సందేశం ఇస్తూ, ప్రతి శనివారం తన నివాసం నుంచి సైకిల్‌పై కలెక్టరేట్‌కు చేరుకుని కార్యాలయ చాంబర్లో విధులు నిర్వహిస్తున్నారు.
పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవాల్సిన అవసరాన్ని తన ఆచరణ ద్వారా చాటుతున్న కలెక్టర్ చర్యపై అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో చిన్నచిన్న మార్పులు తీసుకురావడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కలెక్టర్ సూచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.



