మార్కాపురం జిల్లా: పెద్దారవీడు మండలం తోకపల్లి సమీపంలోని సుంకేశుల పునరావాస కాలనీలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సోమవారం కలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో నివాసం ఉంటున్న నిర్వాసితుల ఇళ్లకు వెళ్లి ఒక్కొక్కరిని కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు, పునరావాస కేంద్రంలో అందుతున్న మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇతర పునరావాస సమస్యలను నిర్వాసితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలు చాలా కాలంగా పరిష్కారానికి నోచుకోలేదని, ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు.
నిర్వాసితుల సమస్యలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ సావధానంగా విని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పునరావాస కేంద్రంలో మౌలిక వసతుల విషయంలో కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.Markapuram District City News
అనంతరం సుంకేశుల పునరావాస కేంద్రంలోని చర్చి ఆవరణలో నూతన భవన నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



