GUNTUR CITY NEWS: బీజేపీకి అనుకూలంగా ఓటు చోరీకి పాల్పడిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలి

Karthik

ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం ఉండేలా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి అనుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే విధంగా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని హిమని సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు అని, ఆ హక్కును కాపాడటం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత అని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని ఆకిటి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పక్షపాత వైఖరి తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ గుంటూరు నగర కమిటీ సభ్యులు నూతల పాటి చిన్న, గుండెబోయిన లక్ష్మి, బి వెంకటేశ్వర రెడ్డి, జంగాల చైతన్య పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review