GUNTUR CITY NEWS: వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయాలి..సీపీఐ

Karthik

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వల్లూరివారి తోట, కాకుమానువారి తోట సమీపంలో ఉన్న వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా త్వరితగతిన అభివృద్ధి చేయాలని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలంలో రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం దృష్టి సారించడం శుభ పరిణామమని వారు పేర్కొన్నారు.ఈ స్థలంలో ఆరు ఎకరాలకు పైగా ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు కోసం, మిగిలిన స్థలంలో వాకింగ్ ట్రాక్, పచ్చదనం, ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టి షటిల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోట మాల్యాద్రి అన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వాకింగ్ చేసేందుకు సరైన సదుపాయాలు లేక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే వల్లూరివారి తోట, కాకుమానువారి తోటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో బిల్డ్ ఏపీ పేరుతో ఈ స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా సీపీఐ ముందుండి అడ్డుకుందని కోట మాల్యాద్రి గుర్తు చేశారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకుండా వాటిని ప్రజా అవసరాలకు వినియోగించాలన్నదే సీపీఐ అభిప్రాయమని తెలిపారు.అదే విధంగా సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని ఈ ప్రాంతంలో సుమారు పన్నెండు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న స్థలం చాలాకాలంగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో స్థలం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని తెలిపారు. సాయంత్రం వేళల్లో ఇక్కడ పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయని, కుటుంబాలతో వెళ్లే ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.ఇటీవల ప్రాంతాన్ని శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించగా పెద్ద సంఖ్యలో ఖాళీ మద్యం సీసాలు, ఇతర వ్యర్థాలు బయటపడినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగానికి కూడా ఈ ప్రాంతం వేదికగా మారకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.ప్రభుత్వం ప్రతిపాదించిన ఆసుపత్రి, వాకింగ్ ట్రాక్, పచ్చదనం, ఇండోర్ స్టేడియం తదితర అభివృద్ధి కార్యక్రమాలను కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో వెంటనే పనులు ప్రారంభించాలని ఇద్దరు నేతలు కోరారు. ప్రజల ఆరోగ్యం, క్రీడలు, ఆహ్లాదం కోసం ఈ స్థలాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review