పిఠాపురం, అక్టోబర్ 4:– పిఠాపురం పాదగయ క్షేత్రంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పితృపక్షాల భోజన కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రమేష్ భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు.
కార్యక్రమానికి ముందు పాదగయ క్షేత్రంలోని గణపతి, దత్తాత్రేయ స్వామి, శ్రీ కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్లను రమేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో స్వాగతం పలకగా, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అనంతరం పితృదేవతలను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆలయ అర్చకులు రమేష్‌కు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పితృపక్షాల సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 14 క్షేత్రాల్లో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పితృదేవతలను స్మరించుకుంటూ భక్తులకు అన్నదానం చేయడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సేవా భావాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించడం సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా రక్షణ దళ సభ్యులు మేడిబోయిన శ్రీను, కాయల మణికంఠ, అంకం ఓం కృష్ణ, గోకేడ ప్రసాద్, జీవీ నాయుడు, గోకేడ రమణ, కొలమూరు బుజ్జి, గుంటముక్కల పెద్ద తదితరులు పాల్గొన్నారు.



