దర్శి:- ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని అద్దంకి రోడ్డులో ఉన్న ఎన్ఎస్పీ కాలనీ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో పంచదశ వార్షిక శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
తెల్లవారుజామున భక్తులు 108 బిందెలతో భాజా భజంత్రీల నడుమ అమ్మవారి దేవస్థానం చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. బాల త్రిపుర సుందరీ దేవికి కుంకుమ పూజ నిర్వహించారు. ఒక బాలికను బాల త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి, ఆమె ద్వారా భక్తులు ఆశీర్వాదాలు పొందారు.
ఈ పూజా కార్యక్రమంలో యన్నగిరి కృష్ణ యాదవ్, ఆయన ధర్మపత్ని మంగమ్మ, కుమార్తెలు, అల్లుళ్లు పాల్గొన్నారు. అనంతరం అన్నదాతలుగా వ్యవహరించిన కృష్ణ యాదవ్, మంగమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.Prakasam Dist News
మహోత్సవాల్లో భాగంగా సుమారు 200 మంది అమ్మవారి భక్తులకు దేవస్థాన గురుస్వాములు కంకణాలు కట్టి ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.



