Prakasam District City News :దర్శి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

S Sarath
1 View

ప్రకాశం జిల్లా:- దర్శి:- ఈ నెల 28న జరగనున్న దర్శి మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. గురువారం దర్శి మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను, చెక్‌పోస్టులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, గాంధీనగర్‌లోని ప్రాథమిక పాఠశాల, చింతలపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ఆయా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులు, రాకపోకల మార్గాలు, రూట్ మ్యాప్‌లు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

28 వార్డులు.. 51 పోలింగ్ స్టేషన్లు

దర్శి మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు, 14 పోలింగ్ లొకేషన్లు, 51 పోలింగ్ స్టేషన్లు ఉండగా, సుమారు 29 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఒకే లొకేషన్‌లో ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఉండటం, గతంలో చోటుచేసుకున్న సంఘటనలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మూడు సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లను గుర్తించినట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు.Prakasam District City News

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, ఈ నెల 16వ తేదీ శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముందస్తు చర్యలతో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం

ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి దర్శి మున్సిపాలిటీ పరిధిలో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. గత నెల రోజులుగా విస్తృతంగా పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పోలింగ్ స్టేషన్లను సందర్శించడం, సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించడం, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు, రౌడీషీటర్లు, అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేయడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రత్యర్థి అభ్యర్థులు సహా పోటీలో ఉన్న వారందరూ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.

ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తాయని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్. యుగంధర్ బాబు, దర్శి డీఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, దర్శి సీఐ నాగమల్లేశ్వరరావు, ఎస్సై ఏడుకొండలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review