అమరావతి / విజయవాడ:-విజయవాడ ఉత్సవ్–2026లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన చైనా రాయబారి జు ఫెయిహాంగ్, టాన్ యూషియూతో కలిసి నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అమరావతిలోని ప్రముఖ బౌద్ధ వారసత్వ ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మహాస్తూపం, పురావస్తు మ్యూజియం, ఐకానిక్ బుద్ధ విగ్రహాన్ని సందర్శించి వాటి చారిత్రక ప్రాధాన్యతను పరిశీలించారు.
అమరావతి ప్రాంతానికి ఉన్న ఘనమైన బౌద్ధ వారసత్వం, ప్రాచీన చరిత్ర, భారతీయ సంస్కృతిలోని శాంతి, సామరస్యం, కరుణ వంటి విలువలను ప్రతిబింబించే విశేషాలను వారు తెలుసుకున్నారు. బౌద్ధ సంస్కృతి ద్వారా భారత్–చైనా దేశాల మధ్య చారిత్రకంగా కొనసాగుతున్న సాంస్కృతిక సంబంధాలను ఈ సందర్శన మరోసారి గుర్తుచేసింది.
అనంతరం విజయవాడలో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్–2026, సరస్ మేళా కార్యక్రమాల్లో చైనా రాయబారి జు ఫెయిహాంగ్, టాన్ యూషియు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం, సంప్రదాయ కళలు, హస్తకళలు, స్థానిక ప్రజల ఆతిథ్య స్ఫూర్తిని చాటిచెప్పేలా ఉత్సవాలు సాగాయి.Vijayawada City News
భారతదేశం–చైనా మధ్య సాంస్కృతిక పరస్పర అవగాహనను పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఈ పర్యటన ప్రాధాన్యతను చాటిచెప్పింది.
కార్యక్రమంలో ఇతర నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ గాయని సునీత, గాయకుడు ధనుంజయ తమ మధురమైన గాత్రంతో అతిథులను, ప్రేక్షకులను అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.



