ఆత్మకూరు/విజయవాడ:– విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAP) కార్యాలయంపై వైఎస్సార్సీపీ శ్రేణులు జరిపిన దాడిని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తీవ్రంగా ఖండించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కోడిగుడ్లు, రాళ్లతో శాప్ ఆఫీస్‌పై దాడులు చేయించి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ద్వారా 16,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ, క్రీడాకారులకు 3 శాతం స్పోర్ట్స్ కోటాను పారదర్శకంగా అమలు చేస్తుంటే, ఓర్వలేక ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.vijayawada City news
గత పాలనపై ఘాటు విమర్శలు: వైఎస్సార్సీపీ హయాంలో ఏపీపీఎస్సీ (APPSC) ప్రశ్నాపత్రాలను ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లతో హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో దిద్దించిన వైనాన్ని మంత్రి గుర్తుచేశారు. పోలీసులు, అధికారుల పర్యవేక్షణ లేకుండా పరీక్ష పేపర్లు మూల్యాంకనం చేయడంపై నాడు న్యాయస్థానాలు తీవ్రంగా తప్పుపట్టాయని, ఆ ఘటనకు సిగ్గుపడాల్సింది పోయి ఈరోజు మెగా డీఎస్సీపై బురద చల్లడం విడ్డూరంగా ఉందని అన్నారు.
సొంత మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని గంటల తరబడి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, ప్రజల సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు, దుర్మార్గాలు బయటపడతాయనే భయంతోనే జగన్ చట్టసభలకు గైర్హాజరవుతున్నారని విమర్శించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన రూ. 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ నిజాలు సిట్ (SIT) నివేదిక ద్వారా తేటతెల్లమవుతున్నాయని, అలాగే వివేకానందరెడ్డి హత్య కేసులోని కీలక వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రధాన అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్ మెగా డీఎస్సీపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు, దాడులు చేయిస్తున్నారని మంత్రి పార్థసారధి స్పష్టం చేశారు.



