గుంటూరు, నవంబర్ 23:– గుంటూరు నగరపాలక సంస్థ (GMC) కార్యాలయం ఇవాళ సందడిగా మారింది. అభిమానులు, కార్యకర్తల కేరింతల మధ్య నూతన పాలకవర్గం కొలువుదీరింది. గుంటూరు ప్రథమ పౌరురాలిగా (మేయర్‌గా) కోవెలమూడి లక్ష్మి అపర్ణ, డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ బాధ్యతలు స్వీకరించారు.
ప్రమాణ స్వీకారం & ఏకగ్రీవ ఎన్నిక జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి సి.ఎం. సాయికాంత్ వర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముందుగా ప్రజల చేత నేరుగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి లక్ష్మి అపర్ణతో పాటు, నగరంలోని 76 మంది కార్పొరేటర్లతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో 64వ వార్డు కార్పొరేటర్ యర్రంశెట్టి రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరును 24వ వార్డు కార్పొరేటర్ నిమ్మల వెంకట రమణ ప్రతిపాదించగా, 45, 6వ వార్డు కార్పొరేటర్లు ముత్తినేని రాజేష్, ఇర్రి సాయి బలపరిచారు. పోటీలో మరెవరూ లేకపోవడంతో రాజేష్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ ప్రకటించారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయమే కీలకం: కలెక్టర్ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ సాయికాంత్ వర్మ.. గుంటూరు అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. నగర అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
దేశంలోనే నంబర్ వన్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతాం: మేయర్ అపర్ణ బాధ్యతల స్వీకరణ అనంతరం మేయర్ కోవెలమూడి లక్ష్మి అపర్ణ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు కూటమి పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.Guntur City News
“నగర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే నా మొదటి ప్రాధాన్యత. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గుంటూరును దేశంలోనే అత్యుత్తమ కార్పొరేషన్లలో ఒకటిగా తీర్చిదిద్దడమే మా ఉమ్మడి లక్ష్యం.” అని ఆమె స్పష్టం చేశారు.
తరలివచ్చిన ప్రముఖులు ఈ వేడుకకు ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్ళా మాధవి, బూర్ల రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ తదితరులు హాజరై నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.



