BAPATLA DISTRICT CITY NEWS : అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం జీవో నం.278

Kumar B
1 View

ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్

చీరాలలో ఉచిత ఇసుక విధానానికి తూట్లు.. పర్చూరులో పక్కాగా అమలు: ఆమంచి

సిటీ న్యూస్ తెలుగు | చీరాల:

రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నం.278ను విడుదల చేయడంపై చీరాల మాజీ ఎమ్మెల్యే, బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ జీవో విడుదల కావడం అక్రమ ఇసుక తవ్వకాలపై తాము చేస్తున్న పోరాటానికి లభించిన విజయమని ఆయన పేర్కొన్నారు.

గురువారం చీరాల పట్టణంలోని క్రిస్టల్ మెగా మార్ట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోందని, అయితే చీరాల నియోజకవర్గంలో మాత్రం ఈ విధానానికి విరుద్ధంగా అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయని ఆరోపించారు.

కావూరివారిపాలెంలో అక్రమ తవ్వకాలు

వేటపాలెం మండలం కావూరివారిపాలెం గ్రామ శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో వందల అడుగుల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి, భారీగా రవాణా చేసినట్లు ఆమంచి ఆరోపించారు. ఈ అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్తులను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు.

గ్రామస్తుల ఫిర్యాదు మేరకు తాను స్వయంగా తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి, తహసీల్దార్‌, మైనింగ్ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

హైకోర్టులో PIL.. అనంతరం జీవో విడుదల

అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఆధారాలతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసినట్లు ఆమంచి వెల్లడించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరిందని, సంబంధిత శాఖల వాదనలు విన్న అనంతరం ఈ నెల 6వ తేదీన ప్రభుత్వం జీవో నం.278 విడుదల చేసిందని తెలిపారు.

అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు నిబంధనలు రూపొందించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ విజయాన్ని కావూరివారిపాలెం గ్రామ ప్రజల విజయంగా భావిస్తున్నానన్నారు.

అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

నూతన జీవో ప్రకారం కావూరివారిపాలెం పరిసర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు అందకపోయినా సంబంధిత తహసీల్దార్లు స్వయంగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తవ్వకాలకు పాల్పడే వ్యక్తులతో పాటు సంబంధిత భూముల యజమానులపైనా చర్యలు తీసుకోవాలని అన్నారు.About Us

చర్యలు లేకుంటే కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు

నియోజకవర్గంలో ఎక్కడైనా అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరిగినట్లు గుర్తిస్తే ముందుగా సంబంధిత తహసీల్దార్‌కు సమాచారం అందిస్తామని ఆమంచి తెలిపారు. స్పందన లేకపోతే ఆధారాలతో జిల్లా కలెక్టర్‌, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో రాత్రివేళల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొందరు పోలీసు సిబ్బంది సహకరిస్తున్నారనే సమాచారం తమకు అందుతోందని, ఆధారాలతో నిరూపితమైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

పర్చూరులో ఉచిత ఇసుక విధానం పక్కాగా అమలు

పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గంలో ఉచిత ఇసుక విధానం సమర్థంగా అమలవుతుండగా, చీరాలలో మాత్రం అక్రమ తవ్వకాలు, రవాణా ద్వారా కొందరు భారీగా లబ్ధి పొందుతున్నారని ఆమంచి విమర్శించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ మేడిద దివ్య సుధాకర్‌తో పాటు నూతనంగా ఎన్నికైన చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు దాసరి శ్రీకాంత్, మేరుగ మేరీ రాణి, పోలిదాసు అంజిబాబు, గోలి మాధవి, షేక్ మామలా, రామిశెట్టి వెంకట్రావు, తుపాకుల రామారావు, ఇట్టా శ్రీలక్ష్మి, సల్లూరి రాజ్యం, పాపబత్తిని థామస్ తదితరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review