విద్యార్థుల్ప్రలో ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయి ఉపకార వేతన పరీక్ష అయిన NMMS (National Means-cum-Merit Scholarship) పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో NMMS 2026 ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన NMMS 2026 గ్రాండ్ మోడల్ టెస్ట్ ఆదివారం ఘనంగా, విజయవంతంగా జరిగింది.
కొత్తపేట భాస్కర్ డీలక్స్ సమీపంలోని శ్రీ జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్షకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలలతో పాటు పరిసర ప్రాంతాల్లోని జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 360 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఒకే రోజు, ఒకే సమయంలో వివిధ ప్రాంతాల విద్యార్థులను ఒకే పరీక్షా వేదికపైకి తీసుకువచ్చి, వాస్తవ NMMS పరీక్షా వాతావరణాన్ని అనుభవించేలా ఈ గ్రాండ్ మోడల్ టెస్ట్‌ను నిర్వహించడం విశేషం. పరీక్ష పూర్తయిన వెంటనే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థులకు మార్కులను తెలియజేశారు. పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన ఐదుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా NMMS 2026 ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ కన్వీనర్ కె. సతీష్ మాట్లాడుతూ, ఆగస్టు నెల నుంచి ‘NMMS 2026 FREE ONLINE TRAINING’ యూట్యూబ్ ఛానల్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని 28 జిల్లాల విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణలో భాగంగా ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన వీడియో పాఠాలు, ప్రత్యక్ష ఆన్లైన్ తరగతులు, క్విక్ రివిజన్ నోట్స్, ప్రతిరోజూ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT), స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) ప్రాక్టీస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతి ప్రశ్నకు సంబంధించిన సమాధానాలను, వివరణలను విద్యార్థులకు అందిస్తున్నామని వివరించారు. డిసెంబర్ 13న జరగనున్న NMMS పరీక్ష వరకు ఈ ఉచిత ఆన్లైన్ శిక్షణ కొనసాగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా NMMS పరీక్షకు సిద్ధమవుతున్న ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ మార్కులు సాధించి ఉపకార వేతనానికి అర్హత పొందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఈ శిక్షణా సామగ్రిని తమ పాఠశాలల్లోని IFB ప్యానెల్స్ ద్వారా విద్యార్థులకు బోధించి మరింత మందికి ప్రయోజనం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. గత మూడు నెలలుగా ఆన్లైన్ శిక్షణ కార్యక్రమానికి విశేష సహకారం అందించిన ఉపాధ్యాయులు శ్రీ ప్రకాష్, శ్రీ మంగారావు, శ్రీ శ్రీనివాసరావు, శ్రీమతి శ్రీలక్ష్మిలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
అదేవిధంగా గ్రాండ్ మోడల్ టెస్ట్ నిర్వహణలో చురుకుగా పాల్గొని తమ సేవలను అందించిన శ్రీ జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ NCC విద్యార్థులతో పాటు బండ్లమూడి హనుమాయమ్మ కళాశాల, జాలయ్య కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి వచ్చిన వాలంటీర్లకు వారి సేవలను గుర్తిస్తూ వాలంటరీ సర్వీస్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మోడల్ టెస్ట్ కో-కన్వీనర్ టి సాయిరాం, గుంటూరు జిల్లా NSS కోఆర్డినేటర్ శ్రీ సుధీర్, ప్రభుత్వ మహిళా కళాశాల NSS ఇన్చార్జి, శ్రీ జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వేణుగోపాలరావు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ బృహత్తర విద్యాసేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనుమతులు, సహకారం అందించిన జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సలీం భాష గారికి, పరీక్ష నిర్వహణకు పూర్తి సహకారం అందించిన శ్రీ జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వేణుగోపాలరావు గారికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మోడల్ టెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థులు పరీక్షా నిర్వహణ పట్ల, తక్షణ మూల్యాంకనం ద్వారా తమ సామర్థ్యాన్ని తెలుసుకునే అవకాశం లభించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు… ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదు… ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆశయంతో నిర్వహించిన ఈ గ్రాండ్ మోడల్ టెస్ట్ విద్యాసేవా రంగంలో ఒక స్ఫూర్తిదాయకమైన ముందడుగుగా నిలిచింది.
ఘనంగా NMMS 2026 గ్రాండ్ మోడల్ టెస్ట్ – 360 మంది విద్యార్థులతో విజయవంతంగా నిర్వహణ

Leave a review Leave a review


