విజయవాడ, నవంబర్ 24:– ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల పనితీరుపై వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ కఠిన వైఖరిని స్పష్టం చేశారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిర్దేశించిన ప్రమాణాల అమలులో ఎలాంటి అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. మంగళవారం విజయవాడలోని వైద్య విద్యా డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రారంభమైన రెండు రోజుల సమీక్షా వర్క్‌షాప్‌లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లకు ఆయన దిశానిర్దేశం చేశారు.
తొలిరోజు శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల అధికారులతో డీఎంఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల పనితీరు, సమస్యలను ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు.
సమావేశంలో డీఎంఈ జారీ చేసిన కీలక ఆదేశాలు:
- ర్యాగింగ్‌పై ఉక్కుపాదం: వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ భూతాన్ని పూర్తిగా అరికట్టాలని, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్లతో నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
- డిజిటల్ రికార్డులు, ఆభా అనుసంధానం: ఓపీ, ఐపీ విభాగాలకు వచ్చే ప్రతి రోగికి ‘ఆభా’ (ABHA) ఐడీ సృష్టించి వైద్య రికార్డులకు అనుసంధానించాలి. ప్రతిరోజూ ఉదయం 10 గంటల కల్లా ఐపీ విభాగాల్లో వ్యాధి నిర్ధారణ వివరాలతో ప్రధాన రిజిస్టర్‌ను నిర్వహించి, సంబంధిత వైద్య బోధకులతో ధ్రువీకరించాలి.
- మందుల కొరత లేకుండా చర్యలు: ఆసుపత్రుల్లో మందుల నిల్వలపై ప్రతిరోజూ సమీక్ష జరపాలి. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్) లో అందుబాటులో లేని మందులను సూపరింటెండెంట్లు స్థానికంగా (లోకల్ పర్చేజ్) కొనుగోలు చేసి రోగులకు అందించాలి.
- నిరంతర పర్యవేక్షణ: వైద్య సిబ్బంది హాజరుకు సంబంధించి ఎఫ్ఆర్ఎస్ (FRS), ఎన్ఎంసీ ఏఈబీఏఎస్ (AEBAS) విధానాలను పకడ్బందీగా పర్యవేక్షించాలి. ఓపీ, శస్త్రచికిత్సలు, ప్రసవాలు, డయాగ్నస్టిక్ పరీక్షల సంఖ్య ఎన్ఎంసీ ప్రమాణాలకు తగ్గకుండా చూడాలి.
- మౌలిక సదుపాయాలు, అవినీతి రహిత సేవలు: అత్యవసర విభాగాల్లో వీల్ చైర్లు, స్ట్రెచర్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలి. విద్యార్థులకు మరుగుదొడ్లు, శుద్ధజలం కల్పించడంతో పాటు వారిలో పరిశోధనలను ప్రోత్సహించాలి. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు విభాగాల నుంచి వచ్చే రోగులకు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించాలని, ఆసుపత్రుల నిర్వహణలో అవినీతికి తావుండకూడదని స్పష్టం చేశారు.Vijayawada city News
ఈ వర్క్‌షాప్‌లో అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రాధికారెడ్డి, జాయింట్ డైరెక్టర్లు కర్రి అప్పారావు, గణపతిరావు పరిపాలనా, ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించగా, ఏపీఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ బలరామిరెడ్డి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. బుధవారం జరిగే రెండో రోజు సమావేశంలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాల వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు పాల్గొననున్నారు.



