Vijayawada City News :పిల్లల గళానికి ప్రాధాన్యమిస్తేనే మెరుగైన భవిష్యత్తు- రాష్ట్రస్థాయి బాలల దినోత్సవ సదస్సులో వక్తల పిలుపు

S Sarath
2 Views

విజయవాడ, నవంబర్ 24:– పిల్లలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తును నిర్దేశించే విధాన రూపకల్పనలో చురుకైన భాగస్వాములుగా గుర్తించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) ఆధ్వర్యంలో అలయన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ (ACR), మహిత సంస్థల భాగస్వామ్యం, యూనిసెఫ్ (UNICEF) మద్దతుతో మంగళవారం విజయవాడలోని సెయింట్ ఆన్స్ ప్రావిన్షియల్ హౌస్‌లో రాష్ట్రస్థాయి బాలల దినోత్సవ వేడుకలు మరియు ప్రత్యేక సంప్రదింపుల కార్యక్రమం ఘనంగా జరిగింది.

అధికారుల ఎదుట గళమెత్తిన చిన్నారులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన సుమారు 80 మంది చిన్నారులు ఈ సదస్సులో పాల్గొని, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమక్షంలో తమ సమస్యలు, సవాళ్లు, ఆకాంక్షలను నిర్భయంగా వ్యక్తం చేశారు. “పిల్లల గళాలు – అనుభవాలు” పేరుతో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిలో బాలల రక్షణ, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, భద్రత మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.

పాఠశాలల్లో సీసీటీవీలకు దూరంగా సజెషన్ బాక్సులు: కమిషన్ సభ్యులు సభకు అధ్యక్షత వహించిన APSCPCR చైర్‌పర్సన్ వెటుకూరి ఎ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ, పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాది అని, వారి హక్కుల పరిరక్షణ అందరి సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. పిల్లలు లేవనెత్తిన సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కమిషన్ సభ్యులు వి. గాంధీ బాబు మాట్లాడుతూ, బాల కార్మిక నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులు తమ ఫిర్యాదులను భయం లేకుండా, గోప్యంగా తెలియజేసేందుకు వీలుగా అన్ని పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాల నిఘాకు దూరంగా ‘సజెషన్ బాక్సులు’ ఏర్పాటు చేయాలని సూచించారు. మరో సభ్యురాలు కె.జి. వెంకట పద్మలత మాట్లాడుతూ, పాఠశాలలు, శిశు సంరక్షణ కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ పిల్లల భద్రతపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని వివరించారు.

శాఖల మధ్య సమన్వయమే కీలకం అంతకుముందు అలయన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ కన్వీనర్ రమేష్ శేఖర్ రెడ్డి బాలల హక్కుల పరిరక్షణకు తమ సంస్థ చేస్తున్న కృషిని వివరించగా, యూనిసెఫ్ ప్రతినిధి ప్రసున్ సేన్ బాలల భాగస్వామ్య ఆవశ్యకతను తెలియజేశారు.Vijayawada City News

ఈ కార్యక్రమంలో సీఐడీ ఎస్ఐ రత్నం, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్, డీఈవో, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహులు, కార్మిక శాఖ అధికారి రామ్‌ప్రసాద్‌తో పాటు విద్యా, మహిళా శిశు సంక్షేమ, పోలీస్, ఆరోగ్య శాఖల అధికారులు, గోడె ప్రసాద్, డేవిడ్, బాలచంద్రం, తిర్పాల్, ఆనంద్ బెంజమిన్, సంధ్య, అమల తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review