గుడివాడ (కృష్ణా జిల్లా):– పట్టణంలో ప్రస్తుతం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులను, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.
స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, వాటర్ వర్క్స్, స్ట్రక్చర్స్, పైప్లైన్ల ఏర్పాటుతో పాటు రహదారుల అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్‌తో పాటు ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ విభాగాల అధికారులు, పనులు నిర్వహిస్తున్న ‘మేఘా’ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక, ఇతర సమస్యలను, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు ఎమ్మెల్యేకు సమగ్రంగా వివరించారు.Krishna disrtrict News
విలీన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలు: పురపాలక సంఘంలో రూరల్ గ్రామాల విలీన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో తలెత్తే తాగునీటి అవసరాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. విలీన గ్రామాల్లో పెరిగే జనాభాను, వారి నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయా ప్రాంతాల అవసరాలకు తగ్గట్టుగా కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి తక్షణమే సమగ్ర నివేదికలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్దేశిత సమయంలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు.



