Amaravathi News :ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు-కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా 17.52 టీఎంసీల నీటి తరలింపు

Sharat
2 Views

అమరావతి, ఆగస్టు 10:– ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాల ప్రవాహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళ్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజ్‌పై తన వాహన కాన్వాయ్‌ను కొద్దిసేపు నిలిపి బ్యారేజ్ పరిస్థితిని పరిశీలించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదికి చేరుతున్న గోదావరి జలాలను సీఎం తిలకించారు.

గోదావరి జలాలతో ప్రకాశం బ్యారేజ్ నిండుగా కనిపిస్తుండటంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటివరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు తెలిపారు.

పట్టిసీమ ద్వారా సమృద్ధిగా గోదావరి జలాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న వివిధ కాలువల ద్వారా కృష్ణా డెల్టా పరిధిలోని పంటలకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 3,115 క్యూసెక్కులు, గుంటూరు చానల్‌కు 115 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

డెల్టా ప్రాంతానికి సాగునీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పట్టిసీమ జలాలు పంటలకు జీవం పోస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎల్‌నినో పరిస్థితుల్లో సాగునీటి కొరత తలెత్తకుండా సమర్థవంతమైన నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ డెల్టా ప్రాంత రైతులకు అవసరమైన సాగునీటిని సకాలంలో అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Author
Share This Article
Leave a review