Guntur City News :సదరం హెల్ప్‌డెస్క్‌లో దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి-నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా

Sharat
1 View

గుంటూరు:– గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లోని సదరం సహాయక కేంద్రం (హెల్ప్‌డెస్క్)లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కోరారు. ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గోరిజవోలు దుర్గాప్రసాద్‌ను కలిసి సమస్యలను వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గుంటూరు జీజీహెచ్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్య సేవల కోసం వస్తుంటారని కాలేషా తెలిపారు. అదే విధంగా దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు జీజీహెచ్‌లోని సహాయక కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారని చెప్పారు. నడవలేని, మాట్లాడలేని, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులతో పాటు వారికి సహాయకులుగా వచ్చే కుటుంబ సభ్యులు, ఇతరులు సర్టిఫికెట్లకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌డెస్క్‌ను సంప్రదిస్తుంటారని పేర్కొన్నారు.

అయితే సదరం హెల్ప్‌డెస్క్‌లో రెగ్యులర్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కొంతమంది సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడంతో దివ్యాంగులు పలుమార్లు ఆసుపత్రికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపించారు. దివ్యాంగులతో వచ్చే సహాయకులతో కూడా కొంతమంది సిబ్బంది విసుక్కోవడం, కసురుకోవడం, సూటిపోటి మాటలతో మాట్లాడటం వంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు.

దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరూ ప్రవర్తించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా జీవితకాల వైకల్య సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో పనిచేసే సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగులకు సంబంధించిన వ్యక్తిగత, వైద్య సమాచారాన్ని గోప్యంగా, భద్రతతో నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

సదరం సహాయక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై విచారణ జరిపి, అవసరమైతే వారిని వెంటనే బదిలీ చేయాలని కాలేషా డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016 నిబంధనలకు అనుగుణంగా దివ్యాంగుల ఆత్మగౌరవం, హక్కులను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ధూపాటి రమణయ్య, మానేపల్లి రవితేజ, బత్తుల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

Author
Share This Article
Leave a review