GUNTUR CITY NEWS: వాటర్ రిజర్వాయర్లు ప్రతి నెలా శుభ్రం చేయాలి

Karthik

గుంటూరు నగరంలోని త్రాగునీటి సరఫరా చేసే ఈఎల్ఎస్ఆర్ లను ప్రతి నెల శుభ్రం చేయాలని, పైప్ లైన్ లీకుల మరమత్తులను అధిక ప్రాధాన్యతగా తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీటి సరఫరా చేయడం ఇంజినీరింగ్ అధికారుల ప్రాధమిక భాధ్యత అని, ప్రతి ఒక్కరూ త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈఎల్ఎస్ఆర్ లను ప్రతి నెల నిర్దేశిత గడువు, ప్రమాణాల మేరకు శుభ్రం చేసి, తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఏఈల పరిధిలో పైప్ లైన్ లీకుల మరమత్తులను ఎప్పటికప్పుడు చేయాలని, లేకుంటే త్రాగునీటి కలుషితంతోపాటు రోడ్లు డ్యామేజి, ప్రజలకు అసౌకర్యం కల్గుతుందన్నారు. కలుషిత నీటి సరఫరా జరగడానికి వీలు లేదని, ఏఈలు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, ఎక్కడైనా లీకులు జరిగే అవకాశం ఉంటే తక్షణం నూతన పైప్ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని, యూజిడి లైన్ మ్యాన్ హోల్స్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న త్రాగునీటి సరఫరాలో నిర్లిప్త వైఖరి ఉండకూడదని, పిజిఆర్ఎస్, 103 కాల్ సెంటర్ల ద్వారా అందే ఫిర్యాదులకు వెంటనే అటెండ్ అవ్వాలని స్పష్టం చేశారు. వాటర్ మీటర్లకు సంబంధించి ఎక్కడా అవుట్ ఆఫ్ ఆర్డర్ అని ఉండడానికి వీలు లేదని, అటువంటి వాటికి డిస్ కనెక్షన్ చేసి, నూతన మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇవ్వాలని ఏఈలను ఆదేశించారు. డ్రైన్లలో పూడికతీత కాంట్రాక్టర్ కి 90 రోజుల నిర్వహణ కాలం ఉన్నందున, ప్రతి వారం ఏఈలు పర్యవేక్షణ చేసి, పూడిక ఉన్న ప్రాంతాల్లో తీయించాలన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయ్యి పనులు ప్రారంభించని పనులను క్యాన్సిల్ చేసి మరలా రీ టెండర్ పిలిచి, త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఏఈలను ఆదేశించారు. నగరంలో ఎక్కడా పాట్ హొల్స్ ఉండటానికి వీలులేదని, ఉన్న పాట్ హోల్స్ కు వెంటనే మరమ్మతులు నిర్వహించాలన్నారు. నగరంలో నిర్మించతలపెట్టిన పార్కులు ఇతర అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంబించాలన్నారు.సమావేశంలో ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, విష్ణు మూర్తి, వేణు గోపాల్, డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review