vijayawada city news :సంకల్పంతోనే అభివృద్ధి సాధ్యం-దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకం- సీఎం చంద్రబాబు

Sharat
1 View

విజయవాడ;- దేశం, రాష్ట్రం, గ్రామం, కుటుంబం అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు ఒక సంకల్పంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా తాను సంకల్పం తీసుకున్నానని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి విజన్ ఉన్నట్టే ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత విజన్ ఉండాలని, పనిచేసే ప్రతి వ్యక్తి సమాజానికి ఒక ఆస్తి అని పేర్కొన్నారు.

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గిరిజన మహిళలు ధింసా, డప్పు, వివిధ వాయిద్యాలతో సీఎంకు స్వాగతం పలికారు. ధింసా నృత్యంలో సీఎం కూడా పాల్గొన్నారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ, తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ గిరిజనులు జీవిస్తున్నారని అన్నారు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేయగలరని పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి స్థాయికి ఎదగడం, అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, ప్రధాని మోదీ వంటి వారు తమ సంకల్పంతో ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఇందుకు ఉదాహరణలని చెప్పారు.

‘నేను–నా దేశం–నా రాష్ట్రం–నా ఊరు–నా కుటుంబం’ అనే భావనతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రైతు తన పంటను మెరుగ్గా పండించడం, మహిళ స్వయం ఉపాధి ద్వారా సంపాదించడం, విద్యార్థి, ఉద్యోగి, వ్యాపారి, కూలీ నిబద్ధతతో పనిచేయడం కూడా దేశ నిర్మాణంలో భాగమేనని అన్నారు. సమాజానికి, దేశానికి తాము ఏమి చేశామన్నదే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని సూచించారు.

అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండ్ గుర్తింపు

అరకు కాఫీని ప్రపంచ స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగును ప్రోత్సహిస్తామని చెప్పారు. కాఫీతో పాటు మిరియాలు, పసుపు వంటి వాణిజ్య పంటలకు ఏజెన్సీ ప్రాంతాన్ని బ్రాండ్‌గా మార్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం ప్రాంతంలోని ఉత్పత్తులు, తేనె, తాటి బెల్లం తదితర అటవీ ఉత్పత్తులకు ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వరకు ప్రభుత్వ అండ ఉంటుందని వెల్లడించారు. అరకు కాఫీని ప్రధాని మోదీ కూడా ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రానికి వచ్చే అతిథులకు అరకు కాఫీని బహుమతిగా అందిస్తున్నామని తెలిపారు.

ఐదు అంశాలతో ఆదివాసీల సమగ్రాభివృద్ధి

ఆదివాసీల సమగ్రాభివృద్ధికి రహదారులు, సురక్షిత తాగునీరు, విద్య, వైద్యం, ఆదాయ వనరుల పెంపు, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని 27.39 లక్షల మంది గిరిజనుల అభివృద్ధికి రూ.4,764 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

2,336 గిరిజన ఆవాసాలకు మిషన్ మోడ్‌లో రహదారి కనెక్టివిటీ కల్పిస్తున్నామని, 2027 నాటికి ప్రతి గిరిజన కుటుంబానికి సురక్షిత తాగునీరు, ఆవాసం కల్పించడంతో పాటు సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమం ద్వారా రూ.1,000 కోట్లతో 905 కిలోమీటర్ల రహదారులు నిర్మించినట్లు వెల్లడించారు.

గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ఫీడర్ అంబులెన్సులు, 108, 104 మొబైల్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, చింతూరు, కేఆర్ పురం, శ్రీశైలం ప్రాంతాల్లో రూ.250 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం 1.5 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సైతం వారిని సిద్ధం చేస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

19 ఎంఓయూలతో 60 వేల మందికి ప్రయోజనం

గిరిజనుల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా కుదుర్చుకున్న 19 ఎంఓయూల ద్వారా 60 వేల మందికి ప్రయోజనం కలుగుతుందని సీఎం తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.

2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యం

2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. సూపర్ సిక్స్, పీ4తో పాటు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ‘గ్రీన్ పాస్‌పోర్ట్’ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రతి పౌరుడు దేశం, రాష్ట్రం, సమాజం కోసం ఒక సంకల్పం తీసుకోవాలని కోరారు.

అనంతరం అంబేద్కర్ కళావేదిక వద్ద ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పాడేరు, రంపచోడవరం, నల్లమల, అరకు, చింతపల్లి, పార్వతీపురం మన్యం తదితర ప్రాంతాల నుంచి ఉత్పత్తులు తీసుకొచ్చిన గిరిజన మహిళలను అభినందించారు. గిరిజన ప్రాంతాల్లో తయారయ్యే ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్ రూపొందించి మెరుగైన మార్కెటింగ్ కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review