GUNTUR CITY NEWS: వేసవి తాపం నుండి నగర ప్రజలకు ఊరట: యుద్ధ ప్రాతిపదికన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్స్, చలివేంద్రాల ఏర్పాటు

Karthik

నగర కమిషనర్ మయూర్ అశోక్ నగరంలో వేసవి ఎండ నుండి ప్రజలకు ఉపశమనం కల్గించేలా జిఎంసి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వాహనదారులు, పాదచారులు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ మ్యాట్ల ఏర్పాటు, ప్రధాన రోడ్ల పై నీటిని స్ప్రే చేయడం, అలాగే చల్లని నీటితో చలివేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఎండలో వేచి ఉండటం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని, దీనిని నివారించేందుకు అన్ని ప్రధాన కూడళ్లలోని సిగ్నల్స్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఎత్తైన గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేశామని, తద్వారా వాహనదారులు నీడలో ప్రశాంతంగా వేచి ఉండే వీలుంటుందన్నారు. ఇప్పటికే హిందూ కాలేజి, హిమని జంక్షన్లలో ఏర్పాటు పూర్తి అయిందని, మంగళవారానికి బృందావన్ గార్డెన్స్, లక్షీపురం మదర్ థెరిస్సా విగ్రహం దగ్గర ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. అదేవిధంగా, నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరంలోని రద్దీ ప్రాంతాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు, మార్కెట్లు మరియు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా చల్లని నీటితో చలివేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి చలివేంద్రం వద్ద పరిశుభ్రత పాటించాలని, నిరంతరం నీటి నిల్వ ఉండేలా సిబ్బంది పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రధాన రోడ్లపై ఎండ తీవ్రత తగ్గించేలా నీటిని స్ప్రే చేయిస్తున్నామన్నారు. ప్రజలు కూడా ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటం శ్రేయస్కరమని సూచించారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review