దెందులూరుఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. టీడీపీ నేత ఈడ్పుగంటి శ్రీనివాస్ సస్పెన్షన్

City News Telugu

ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు ఈడ్పుగంటి శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ (చంటి) వెల్లడించారు.

తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, అదే పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలను పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్లు పేర్కొన్నారు.

పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు భంగం కలిగించే చర్యలను తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని బడేటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా వేదికలపై లేదా మీడియా ముందు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలను నివారించాలని సూచించారు.

ఈ నేపథ్యంలో ఈడ్పుగంటి శ్రీనివాస్‌పై సస్పెన్షన్ చర్యలు అమల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. పార్టీ నిర్ణయాలను ప్రతి కార్యకర్త గౌరవించాలని, అంతర్గత విభేదాలు ఉంటే పార్టీ వేదికల ద్వారానే పరిష్కరించుకోవాలని నాయకత్వం సూచించినట్లు పేర్కొన్నారు.

ఈ పరిణామం దెందులూరు నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సస్పెన్షన్‌పై ఈడ్పుగంటి శ్రీనివాస్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Share This Article
Leave a review