GUNTUR DISTRICT NEWS: ప్రతి ఫిర్యాదుపై నిష్పాక్షిక విచారణ.. నిర్ణీత గడువులో పరిష్కారం – బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం

Karthik

ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనం కలిగిన పోలీసింగ్ అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా అందే ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తోపాటు,డీఎస్పీ స్థాయి అధికారులు, ఇతర పోలీస్ అధికారులు మొత్తం 162 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును ఎస్పీ పరిశీలించి, సంబంధిత అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఫిర్యాదులపై నిష్పాక్షికంగా విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.PGRS ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్ విధానంలో సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ప్రతి పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి తీసుకున్న చర్యలను సంబంధిత ఫిర్యాదుదారునికి తప్పనిసరిగా తెలియజేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుని అభిప్రాయాన్ని తెలుసుకున్న అనంతరం మాత్రమే పిటిషన్‌ను ముగించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలకు కేవలం తాత్కాలిక పరిష్కారాలతో సరిపెట్టకుండా, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో, సేవాభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Author
Share This Article
Leave a review