విజయవాడ: ఇరవై సూత్రాల కార్యక్రమాల (వికసిత్ భారత్–స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్ శుక్రవారం విజయవాడ ఎంజీ రోడ్డులోని బాపు మ్యూజియంలో దేవకీ దేవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాల్స్‌ను పరిశీలించి, లక్ష్మీదేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్న ఈ డ్వాక్రా బజార్‌లో మొత్తం 100 ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహిళలు తయారు చేసిన హస్తకళలు, గృహోపకరణాలు, ఆహార ఉత్పత్తులు, ఇతర స్వయం ఉపాధి వస్తువులను లంకా దినకర్ పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన లంకా దినకర్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘వికసిత్ భారత్’ సంకల్పంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు కీలక పాత్ర ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో మహిళలకు ఏడాదికి రూ.1 లక్షకు పైగా ఆదాయం వచ్చేలా ‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్ల మంది లఖ్‌పతి దీదీలు రూపొందగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21.15 లక్షల మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. 2029 నాటికి దేశంలో 6 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందులో రాష్ట్రం నుంచి కనీసం 45 లక్షల మంది మహిళలు లఖ్‌పతి దీదీలుగా ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలు, పీఎంఈజీపీ, సూక్ష్మ పరిశ్రమల రుణాలు, డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా అందించే ఆర్థిక సహాయ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
డ్వాక్రా మహిళా సంఘాలను దేశంలోనే తొలిసారిగా ప్రోత్సహించి మహిళా సాధికారతకు బాటలు వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. సామాన్య మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలో నిలిచిపోతారని లంకా దినకర్ అన్నారు.



