Vijayawada City News :దివ్యాంగుల దినోత్సవాన్ని ఆత్మగౌరవంతో ఘనంగా నిర్వహించాలి-దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి విజ్ఞప్తి

S Sarath
1 View

విజయవాడ:– డిసెంబర్ 3న జరగనున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో అత్యంత ఘనంగా, దివ్యాంగుల ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా నిర్వహించేలా జిల్లాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కాలేషా కోరారు.

సోమవారం విజయవాడలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డిని కలిసి, జిల్లాల స్థాయిలో వేడుకల నిర్వహణలో జరుగుతున్న లోపాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

నిధుల దుర్వినియోగం, నిర్లక్ష్యంపై ఆవేదన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, పలు జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఆ ఫలాలు దివ్యాంగులకు అందడం లేదని షేక్ కాలేషా ఆరోపించారు. గత ఏడాది (2025 డిసెంబర్ 3) జరిగిన పలు చేదు అనుభవాలను ఆయన డైరెక్టర్‌కు వివరించారు:

  • నెల్లూరు జిల్లాలో: జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలో వేడుకలు నిర్వహించకుండా, నిధులను పక్కదారి పట్టించి మారుమూల ప్రాంతమైన వెంకటాచలంలోని సీఆర్సీ (CRC) సెంటర్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం లేక, ఆర్థిక భారంతో చాలామంది దివ్యాంగులు కార్యక్రమానికి హాజరుకాలేక తీవ్ర నిరాశకు గురయ్యారు.
  • గుంటూరు జిల్లాలో: గుంటూరు పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకలు ఏర్పాటు చేసినప్పటికీ, అప్పటి ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ దుర్గాబాయి కనీస భోజన వసతి కూడా కల్పించలేదని, దీంతో కార్యక్రమానికి వచ్చిన దివ్యాంగులు ఆకలితో వెనుదిరగాల్సిన అవమానకర పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.Vijayawada City News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, కొందరు క్షేత్రస్థాయి అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి, సంక్షేమ శాఖకు చెడ్డపేరు వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది అలాంటి పొరపాట్లు ఎక్కడా జరగకుండా కఠినమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

డైరెక్టర్ సానుకూల స్పందన షేక్ కాలేషా విజ్ఞప్తిపై దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది డిసెంబర్ 3న జరిగే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రాల్లోనే, దివ్యాంగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఘనంగా నిర్వహించేలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాలకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

Author
Share This Article
Leave a review