జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయి బాట పట్టారు. వారంలో గురు, శుక్ర, శని వారాలు – మూడు రోజులు అధికారులు – మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల్లో పర్యటనలు చేశారు. మండల అధికారులతో సమీక్షలు నిర్వహించి ఏ విభాగంలో మండలం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందో తెలుసుకోవడం జరిగింది. మండలంలో ఉన్న సమస్యలను సైతం గుర్తించి, ప్రణాళికాబడ్డంగా వాటిని పరిష్కరించుటకు చర్యలను చేపడుతున్నారు. మండలాల్లో వేసవి తీవ్రత, తాగునీటి సమస్య, జల ధార – జల హారతి కార్యక్రమం, జన గణన, పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల చేరికలు, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఆర్జీలు పరిష్కారం, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు, ఆసుపత్రుల పనితీరు, పారిశుధ్య నిర్వహణ, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు తనిఖీ, క్షేత్ర స్థాయిలో ఎరువుల అవసరాలు తదితర అంశాలపై వివరంగా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మూడు రోజుల పాటు జరిగే క్షేత్ర స్థాయి పర్యటన వలన ప్రతి గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలు, వాటి అవసరాలను గుర్తించి చేపట్టుటకు అవకాశం ఉందని మండల ప్రత్యేక అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఆర్జీల పట్ల ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సంతృప్తి మేరకు పరిష్కారం చేయుటకు మంచి అవకాశం అన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని వాటిపట్ల ప్రజల్లో ఉండే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ నేరుగా తెలుసుకుని అవసరం మేరకు చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. క్షేత్ర స్థాయి పర్యటనలు పూర్తి స్థాయిలో అవగాహనకు దోహదం చేస్తుందని, ఒక సమస్యపై స్పష్టమైన ప్రణాళిక వేయుటకు సహకరిస్తుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. మండలాలు, గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలు, సమస్యలు తెలుసుకోవడం వలన ప్రభుత్వ యంత్రాంగానికి నిర్దిష్ట చర్యలు చేపట్టుటకు అవకాశం ఉందని చెప్పారు.



