GUNTUR DISTRICT NEWS: ‘పర్యావరణ విధ్వంసం మానవ మనుగడకు విఘాతం’

Karthik

జాషువా 131వ జయంతి సందర్భంగా బ్రాడీపేటలోని విజ్ఞాన కేంద్రంలో గురువారం సాయంత్రం ‘ప్రకృతి, పర్యావరణం పరిరక్షణ – సవాళ్లు’ అనే అంశంపై కవితా సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి కన్వీనర్ బి. సుధా కిరణ్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. సత్యాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఉక్రెయిన్ తో సహా పలు దేశాలు అనుసరిస్తున్న ప్రమాదకర విధానాలు, వారి అమానవీయ యుద్ధ కాంక్ష ఫలితంగా ప్రపంచ పర్యావరణం ప్రమాదంలో పడిందని తెలియజేశారు. మన దేశంలో కూడా ప్రజల్లో నెలకొన్న మూఢ విశ్వాసాలు, ప్లాస్టిక్ వినియోగం, అడవులు మరియు చెట్ల నరికివేత, ప్రకృతి వనరుల దోపిడీ వంటి అనాలోచిత చర్యలు పర్యావరణ పరిరక్షణకు తీవ్ర ఆటంకాలుగా పరిణమించాయని అన్నారు. ప్రకృతిని, సహజ వనరులను కాపాడుకుని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రచయితల సంఘం కార్యదర్శి ఎస్. ఎమ్.సుభాని కవితా సమ్మేళనాన్ని సమన్వయం చేశారు. అనేకమంది కవులు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తమ కవితలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మెట్టు శ్రీనివాసరెడ్డి, నానా, యక్కంటి పద్మావతి, పింగళి భాగ్యలక్ష్మి, చుండూరు శేషుమాంబ తదితరులు పాల్గొన్నారు.బి. సుధా కిరణ్ కన్వీనర్ గా మరియు ఎస్.ఎమ్.సుభాని, డాక్టర్ ఎ. ఎస్. ప్రసాద్, నానా, కోసూరి రవికుమార్, డి.అనిల్ కుమార్, కె.అనురాధతో మొత్తం 13 మంది సభ్యులతో సాహితీ స్రవంతి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.

Author
Share This Article
Leave a review