మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని గంటల తరబడి విచారించడం ఖండనీయం: GDAAP ఏలూరు GMC యూనిట్

City News Telugu

మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 26-05-2026న చోటుచేసుకున్న ఘటనపై గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (GDAAP) ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల యూనిట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఘటన వివరాల ప్రకారం, మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని పోలీసులు సుమారు 10 గంటలపాటు నిర్బంధించి విచారించినట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందిని ఇంత సుదీర్ఘ కాలం పాటు విచారణ పేరుతో నిలిపివేయడం వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇది వైద్య వర్గాలలో ఆందోళన కలిగించే అంశమని GDAAP పేర్కొంది.

ఈ సందర్భంగా GDAAP ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల యూనిట్ అధ్యక్షులు డా. కె. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలను కాపాడే అత్యంత కీలకమైన బాధ్యతను నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని విధులకు ఆటంకం కలిగే విధంగా గంటల తరబడి విచారించడం సరైన పద్ధతి కాదని అన్నారు.

వైద్యులు, వైద్య సిబ్బంది పట్ల పరస్పర గౌరవం, చట్టబద్ధమైన విధానాలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏవైనా విచారణలు అవసరమైతే సంబంధిత నిబంధనల ప్రకారం నిర్వహించాలే గానీ, వైద్య సేవలకు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరించకూడదన్నారు.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పూర్తి వివరాలు సేకరించాలని, బాధిత వైద్య సిబ్బందికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని GDAAP ఏలూరు GMC యూనిట్ డిమాండ్ చేసింది.

వైద్య సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీసే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని సంఘం కోరింది. అలాగే వైద్య వృత్తి గౌరవాన్ని కాపాడేలా అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది.

Share This Article
Leave a review