హైదరాబాద్: సికింద్రాబాద్ చిల్కలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 7 అర్ధరాత్రి జరిగిన యువకుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యావన్ అనే యువకుడిని ప్రియురాలి కుటుంబ సభ్యులే పథకం ప్రకారం అంతమొందించారని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేసినట్లు సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు.
పక్కా ప్లాన్‌తోనే హత్య
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం, ఇది క్షణికావేశంలో జరిగిన హత్య కాదు, ఐదు రోజుల ముందే రచించిన పక్కా స్కెచ్. యావన్, చంద్రిక అనే యువతి పాఠశాల రోజుల నుండి స్నేహితులు. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, ఈ ప్రేమాయణం యువతి ఇంట్లో నచ్చలేదు. గతంలో కూడా యావన్‌ను వారు పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో, అతడిని అడ్డు తొలగించుకోవాలని యువతి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.
నిందితుల వివరాలు – రౌడీ షీటర్ కీలక పాత్ర
ఈ కేసులో ప్రధాన నిందితుడు (A1) అల్లబోయిన సాయి కిరణ్. ఇతడు యువతికి బావ అవుతాడు మరియు చిల్కలగూడ పోలీస్ స్టేషన్లో ఇతడిపై రౌడీ షీట్ కూడా ఉంది. సాయి కిరణ్ సదరు యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడని, అందుకే యావన్‌పై కక్ష పెంచుకుని హత్యకు ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు.
అరెస్టయిన నిందితుల జాబితా:
- A1: అల్లబోయిన సాయి కిరణ్ (యువతి బావ – ప్రధాన సూత్రధారి)
- A2: రాజం పరమేష్ కుమార్ యాదవ్ (యువతి సోదరుడు)
- A3 & A4: రాజం వంశీ కృష్ణ, రాజం మనీష్ (కజిన్ బ్రదర్స్)
- A7: రాజం నర్సింహ యాదవ్ (యువతి తండ్రి)
- A8 & A9: రాజం శ్రీశైలం, రాజం మల్లేష్ (యువతి బాబాయ్‌లు)
- వీరితో పాటు శ్రీగిరి రాహుల్ (A5), కుచ్చుల శివ నందన్ యాదవ్ (A6) మరియు ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో ఇద్దరికి ‘గాంజా’ పాజిటివ్
హత్య జరిగిన సమయంలో నిందితులు మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. వైద్య పరీక్షల్లో నిందితులైన శ్రీగిరి రాహుల్ (A5), శివ నందన్ యాదవ్ (A6) లు గంజాయి సేవించినట్లు (Ganja Positive) తేలిందని డీసీపీ స్పష్టం చేశారు.
ఐదు బృందాలతో వేట
కేసు తీవ్రతను బట్టి ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు, రెక్కి నిర్వహించిన ఆధారాలను, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి:
- హత్యకు ఉపయోగించిన కత్తి
- మొబైల్ ఫోన్లు
- కృత్యానికి వాడిన ద్విచక్ర వాహనంను సీజ్ చేశారు.
నిందితులందరినీ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రేమ పేరుతో ఒక యువకుడిని కుటుంబ సభ్యులందరూ కలిసి దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.



