Amaravathi Local News :20 వేల హెక్టార్లలో 2 కోట్లకుపైగా సీడ్ బాల్స్‌ వెదజల్లిన అటవీశాఖ-50 శాతం గ్రీన్‌ కవర్‌ లక్ష్య సాధన దిశగా కీలక అడుగు

Sharat
1 View

అమరావతి:– ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపొందించే దిశగా సీడ్‌ బాల్స్‌ విస్తరణ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌ నిర్దేశించిన 50 శాతం గ్రీన్‌ కవర్‌ లక్ష్య సాధనలో భాగంగా అటవీశాఖ చేపట్టిన ఈ కార్యక్రమం నిర్దేశిత లక్ష్యంలో 85 శాతం వరకు పూర్తయింది.

అటవీశాఖ ఆధ్వర్యంలో స్థానిక సమాజాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇప్పటివరకు సుమారు 2.06 కోట్ల సీడ్‌ బాల్స్‌ను అటవీ ప్రాంతాల్లో వెదజల్లారు. మొత్తం 20,929 హెక్టార్ల విస్తీర్ణంలో సీడ్‌ బాల్స్‌ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. ఈ సీజన్‌లో 3 కోట్లకుపైగా సీడ్‌ బాల్స్‌ను వెదజల్లే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మూలపాడు ఎకో పార్క్‌లో తొలి విత్తన బంతిని తయారు చేయడం ద్వారా పవన్‌ కళ్యాణ్‌ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో ఇప్పటివరకు 2.82 కోట్ల సీడ్‌ బాల్స్‌ తయారీకి బీజం పడింది.

డ్రోన్లతో సీడ్‌ బాల్స్‌ విస్తరణ

మానవ వనరులు సులభంగా చేరుకోలేని అటవీ ప్రాంతాల్లో వృక్ష సంపద క్షీణించిన ప్రాంతాలను గుర్తించేందుకు అటవీశాఖ డ్రోన్‌ సాంకేతికతను వినియోగిస్తోంది. వాతావరణ పరిస్థితులు, భౌగోళిక స్వభావానికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో పెరిగే స్వదేశీ, బహుళ ప్రయోజన జాతుల విత్తనాలను ఎంపిక చేసి సీడ్‌ బాల్స్‌గా తయారు చేస్తున్నారు.

వర్షపాతం మెరుగుపడిన నేపథ్యంలో అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాల్లో సీడ్‌ బాల్స్‌ను విస్తరిస్తున్నారు. తిరుపతి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, రాజమహేంద్రవరం, ఎన్టీఆర్‌, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది.

అటవీ అంచుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది, సరిహద్దు గ్రామాల ప్రజల సహకారంతో సీడ్‌ బాల్స్‌ తయారీ, రవాణా, విస్తరణ పనులను ఉద్యమంలా చేపడుతున్నారు. దీంతో అటవీ పునరుద్ధరణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తున్నారు.

మొలకలపై ప్రత్యేక దృష్టి

సీడ్‌ బాల్స్‌ విస్తరణ ప్రక్రియ కీలక మైలురాయిని చేరుకోవడంపై ఇందులో భాగస్వాములైన అటవీశాఖ సిబ్బందిని పవన్‌ కళ్యాణ్‌ అభినందించారు. 50 శాతం గ్రీన్‌ కవర్‌ లక్ష్య సాధనలో సీడ్‌ బాల్స్‌ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఇప్పటికే సీడ్‌ బాల్స్‌ వెదజల్లిన ప్రాంతాల్లో మొలకల శాతం, మొక్కల ఎదుగుదల, వాటి సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. సీడ్‌ బాల్స్‌ ద్వారా క్షీణించిన అటవీ ప్రాంతాలను పునరుద్ధరించి రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత విస్తరించేందుకు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Author
Share This Article
Leave a review