Parchuru Local News :గుంటూరు ఛానల్ పొడిగింపుపై వైకాపా దొంగ దీక్షలు-ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వర్గం ధ్వజం

Sharat
1 View

పర్చూరు:– గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకొచ్చి, పనులను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందించే బాధ్యత రైతు బిడ్డ, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుదేనని పర్చూరు మండల పార్టీ అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు (ఫ్యాక్టరీ) స్పష్టం చేశారు. ఛానల్ పనులపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.

పర్చూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు వైకాపా తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షంషుద్దీన్ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైకాపా పాలనలో మంచినీటి కోసం ఏమీ చేయని నాయకులు, ఈ రోజు క్రెడిట్ కోసమే ‘దొంగ దీక్షలు’ చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు తీసుకువచ్చే పూర్తి బాధ్యతను ఎమ్మెల్యే ఏలూరి భుజాన వేసుకున్నారని తెలిపారు.

పర్చూరు ఎస్సీ సెల్ నాయకుడు అబ్రహం మాట్లాడుతూ.. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో గుంటూరు ఛానల్‌ను తొలి దశలో తొండివాగు వరకు పొడిగించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రెండో దశలో పర్చూరువాగు వరకు అనుమతులు చివరి దశలో ఉన్న సమయంలో వైకాపా నేతలు క్రెడిట్ కొట్టేసేందుకు టెంట్లు వేసి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని పంట కాలువల రిపేర్లకు గానీ, గుర్రపుడెక్క తొలగింపునకు గానీ రూపాయి నిధులు తేలేని నాయకులు ఈ రోజు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

అలాగే, వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు బంద్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నేత కొరిటాల సురేష్ హెచ్చరించారు. జగన్‌కు సోకిన ‘క్రెడిట్ చోరీ’ వ్యాధి స్థానిక వైకాపా నేతలకు కూడా సోకినట్లుందని ఆయన ఎద్దేవా చేశారు.

Author
Share This Article
Leave a review