పిట్టలవానిపాలెం (ప్రతినిధి):తల్లిదండ్రులపై అలిగి ఇంటి నుంచి పారిపోయిన ఓ బాలుడి ఉదంతం గంటల వ్యవధిలోనే సుఖాంతమైంది. చందోలు ఎస్సై శివకుమార్ యాదవ్ తన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాలుడిని సురక్షితంగా కనిపెట్టారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
మండల పరిధిలోని ఖాజీపాలెం గ్రామానికి చెందిన నాగ సాయి అనే బాలుడు సోమవారం నుంచి కనబడకుండా పోయాడు. తనను డబ్బులు అడగగా తల్లిదండ్రులు నిరాకరించడంతో, మనస్తాపం చెందిన బాలుడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్ముతో మద్రాస్ రైలు ఎక్కి పారిపోయాడు. కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చందోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన ఎస్సై శివకుమార్:
ఫిర్యాదు అందిన వెంటనే జిల్లా ఎస్పీ, డీఎస్పీ మరియు సీఐ ఆదేశాల మేరకు ఎస్సై శివకుమార్ యాదవ్ తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. రాత్రింబవళ్లు శ్రమించి, సాంకేతిక పరిజ్ఞానం (Technical Surveillance) సాయంతో బాలుడు చెన్నై వెళ్లినట్లు గుర్తించారు. గంటల వ్యవధిలోనే బాలుడి ఆచూకీ కనుగొని క్షేమంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
ప్రజల ప్రశంసలు:
తక్కువ సమయంలో కేసును ఛేదించిన ఎస్సై శివకుమార్ యాదవ్‌ను బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలతో ముంచెత్తారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఎస్సై శివకుమార్ తనదైన శైలిలో నేరాలను అదుపు చేస్తూ, ప్రజలకు పోలీసు శాఖపై అవగాహన కల్పిస్తున్నారు.



