పర్చూరు, జూన్ 14 :-పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం పలు గ్రామాల్లో పర్యటించి ఇటీవల మరణించిన పార్టీ నాయకులు, గ్రామ పెద్దల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, వారికి ధైర్యం చెప్పారు. కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా చిన్నందిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నర్రా వెంకటరామయ్య నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ బలోపేతానికి వెంకటరామయ్య అందించిన సేవలను స్మరించుకున్నారు.
అనంతరం దేవరపల్లి గ్రామంలో ఇటీవల కన్నుమూసిన కొరిటాల అన్నపూర్ణమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే పార్టీ నాయకుడు పుల్లెల వీరయ్య మృతిపై సంతాపం వ్యక్తం చేసి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యక్రమాల్లో వీరయ్య చురుకైన పాత్ర పోషించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
దేవరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కొమ్మాలపాటి కోటేశ్వరరావు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే ఏలూరి, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు.
అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న గోరంట్ల సుభాషిణిని వారి నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.



