విజయవాడ, జూలై 30 :– బందర్ రోడ్డులోని పీవీపీ మాల్ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం ప్రమాద స్థలాన్ని గురువారం పరిశీలించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు జరిగిన ఈ పరిశీలనలో ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను అధికారులు గుర్తించారు.
వాహనదారులు అతివేగంగా ప్రయాణించడం, పాదచారులు ట్రాఫిక్‌ను గమనించకుండా రోడ్డు దాటడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని డీసీపీ పేర్కొన్నారు. ప్రమాదాల నివారణ కోసం వాహనాల వేగాన్ని నియంత్రించే రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బ్లింకర్లు, డివైడర్లపైకి వాహనాలు ఎక్కకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు.
దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు వీలైనంత త్వరగా చేపడతామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ డి.వి. రమణ మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలని డీసీపీ ఆదేశించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



