ధర్మాజిగూడెం: జూలై 30 :– విద్యార్థినుల్లో భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు సైబర్ నేరాలు, లైంగిక వేధింపులు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై చైతన్యం కల్పించేందుకు ధర్మాజిగూడెం బాలికల హైస్కూల్‌లో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో, చింతలపూడి ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ధర్మాజిగూడెం ఎస్ఐ వెంకన్న తన సిబ్బందితో కలిసి లింగపాలెం మండలం ధర్మాజిగూడెం బాలికల ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, లైంగిక వేధింపులు, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల నుంచి రక్షణ, శక్తి యాప్ వినియోగం, డయల్-112 అత్యవసర సేవలు, స్వీయ రక్షణ పద్ధతులపై సమగ్రంగా అవగాహన కల్పించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను గుర్తించడం, ఈవ్‌టీజింగ్, ప్రేమ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండడం, మహిళల రక్షణకు అమలులో ఉన్న చట్టాలు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో విద్యార్థినుల భద్రత కోసం శక్తి దళం సభ్యులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



