కైలాసంలో కొలువుదీరి జగత్తును పాలిస్తున్న పార్వతీ పరమేశ్వరుల జీవితంలో జరిగిన ఒక సంఘటన భూలోకంలో మహిమాన్విత దేవత అవతారానికి కారణమైందని స్థానిక పురాణ గాథలు చెబుతున్నాయి. ద్వాపర యుగాంతంలో ఒక రోజు నారద మహర్షి, నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి కైలాసానికి విచ్చేసి పరమశివుని దర్శించారు. ఆ సమయంలో నారద మహర్షి “స్వామీ… మీ దివ్య నాట్యం చూడాలని కోరికగా ఉంది” అని కోరగా పరమశివుడు “ఈ రోజు మా బదులు నందీశ్వరుడు నాట్యం చేస్తాడు” అని చెప్పి నందీశ్వరునికి ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞ మేరకు నందీశ్వరుడు నాట్యం ప్రారంభించగా అతని నాట్యంలో లయబద్ధత లేకపోవడం, వింత ఆకారం చూసి పార్వతీదేవి నవ్విందని చెబుతారు. అదే సమయంలో నారదుడు శిలాద మహర్షిని రెచ్చగొట్టడంతో కోపోద్రిక్తుడైన శిలాదుడు “పరమశివుని భార్య అనే గర్వంతో నా కుమారుడిని అవమానించావు… భూలోకంలో మానవ రూపంలో జన్మించి వివాహానికి ముందే గర్భం ధరించి అవమానాలు ఎదుర్కొని చివరకు అగ్నికి ఆహుతి అవుతావు” అంటూ పార్వతీదేవిని శపించాడు. శాపం విన్న పార్వతీదేవి క్షమాపణ కోరగా శిలాదుడు ఆమె శాప విమోచనానికి మార్గం కూడా చూపాడని చెబుతారు. భూలోకంలో యాగంటి వంశంలో జన్మించి కామధేనువును పూజిస్తూ గోపంచకం సేవించడం ద్వారా నందీశ్వరుడు సూక్ష్మరూపంలో ఆమె గర్భంలో జన్మిస్తాడని, మానవ రూపాంతంతో శాప విమోచనం కలుగుతుందని తెలిపాడని పురాణం వివరిస్తుంది.
అలా శాప ఫలితంగా పార్వతీదేవి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం అడిగొప్పల గ్రామ సమీపంలోని నిదానంపాడులో యాగంటి రామయ్య – సుగుణమ్మ దంపతులకు కుమార్తెగా జన్మించి శ్రీలక్ష్మిగా పేరుపొందింది. ఆమె జననానికి ముందే కామధేనువు గోవుగా వారి ఇంట జన్మించిందని చెబుతారు. చిన్నప్పటి నుంచే శ్రీలక్ష్మి ప్రతిరోజూ గోశాలకు వెళ్లి కామధేనువుకు నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి గోపంచకం సేవించేదని, ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియదని స్థానికులు చెబుతుంటారు. ఇలా పన్నెండు సంవత్సరాలు గడిచిన తరువాత ఒక రోజు ఆంబోతు వీర్యకణాలతో కలిసిన గోపంచకాన్ని సేవించడం ద్వారా శాప ప్రభావంతో ఆమె అకాల గర్భం దాల్చిందని పురాణ గాథ చెబుతోంది. కాలక్రమంలో ఆమె శరీరంలో మార్పులు కనిపించడంతో గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేయగా వివాహం కాకుండానే గర్భం ధరించిందని అపవాదులు మొదలయ్యాయి. గ్రామ పెద్దగా ఉన్న తండ్రి రామయ్య కూడా ఈ విషయం తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యాడని, శ్రీలక్ష్మి తాను నిర్దోషినని, ఇదంతా దైవలీల అని చెప్పినా ఎవరూ నమ్మలేదని కథనం చెబుతుంది. ఊరంతా ఈ విషయం వ్యాపించడంతో కుటుంబ పరువు పోయిందని భావించిన అన్నలు ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఒక రోజు పొలానికి భోజనం తీసుకురమ్మని చెప్పి ఆమెను పంపించినట్లు చెబుతారు. మార్గమధ్యంలో కామధేనువు ప్రత్యక్షమై “నీ అన్నలు నిన్ను అగ్నిదహనం చేయాలని కుట్ర పన్నారు… అక్కడికి వెళ్లవద్దు” అని హెచ్చరించినా, అన్నల మాట కాదనలేక శ్రీలక్ష్మి పొలానికి బయలుదేరిందని పురాణం చెబుతోంది. నాగేంద్రుడు కూడా ఆమెను వారించాడని, అయినా ఆమె తిరిగి వెళ్లలేదని కథనం కొనసాగుతుంది. పొలం వద్ద అన్నలు ఆమెను పత్తి మండే పైకి ఎక్కించి చుట్టూ మంటలు పెట్టారని, “అన్నలారా… నేను ఏ పాపం చేయలేదు… నన్ను ఇలా దహనం చేయడం మీకు న్యాయమా?” అంటూ విలపించినా ఎవరూ వినలేదని చెబుతారు. అలా శ్రీలక్ష్మి అగ్నికి ఆహుతి కావడం చూసి నాగేంద్రుడు కూడా అగ్నిలో దూకాడని, గోశాల నుంచి కామధేనువు పరుగెత్తుకుంటూ వచ్చి అగ్నిలో ఆహుతి అయ్యిందని స్థానిక విశ్వాసం. అదే సమయంలో భారీ శబ్దంతో భూమి చీలి అందులో నుంచి సువర్ణ శిలా రూపంలో శ్రీలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమై గ్రామ ప్రజలకు దర్శనమిచ్చిందని చెబుతారు. గ్రామ ప్రజలతో మాట్లాడిన అమ్మవారు “నేను కారణ జన్మురాలిని… నన్ను ఎండలోనే భక్తులు దర్శించుకోవాలి… నాకు ఆలయం నిర్మించవద్దు… నా రూపాన్ని చెక్కరాదు… ప్రతి ఆదివారం పసుపు, కుంకుమలతో పూజించండి” అని ఆదేశించి భూమిలోకి అంతర్ధానం అయ్యిందని పురాణ గాథలు చెబుతున్నాయి.
అప్పటి నుంచి నిదానంపాడులో నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారిగా ఆమె పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా వెలుగొందుతోంది. అమ్మవారికి ప్రత్యేక విగ్రహ రూపం లేకపోయినా ఆమె మహిమలు అనేక ప్రాంతాలకు వ్యాపించాయని భక్తులు విశ్వసిస్తున్నారు. సంతానం లేని వారు ఈ తల్లిని దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, కొత్త వాహనాలకు పూజ చేస్తే ప్రమాదాలు జరగవని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటుండగా ఫాల్గుణ పౌర్ణమి సమీప ఆదివారం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముందుగా పుట్టింటి యాగంటి వారి కుంకుమ బండి ప్రభ రావడం ప్రత్యేకతగా నిలుస్తుంది. ఒకప్పుడు సాధారణ గ్రామ దేవతగా భావించిన ఈ తల్లి నేడు పల్నాడు ప్రజల ఆరాధ్య దైవంగా, భక్తుల పాలిట కొంగుబంగారంగా వెలుగొందుతోంది. “జయ జయ లక్ష్మి… నిదానంపాటి శ్రీలక్ష్మి…” అని భక్తితో ప్రార్థిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ నేటికీ ఈ తల్లి మహిమలను తరతరాలకు చెప్పుకుంటున్నారు.



