GUNTUR DISTRICT NEWS: కార్మికుల ఆరోగ్యం పట్ల యాజమాన్యాలు శ్రద్ధ వహించాలి

Karthik
1 View
Oplus_16908288

వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా కార్మికుల ఆరోగ్యం పట్ల యాజమాన్యాలు శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ స్పష్టం చేశారు. వేసవి ఎండ తీవ్రత పట్ల కార్మికులు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వేసవిలో ఎండ తీవ్రత పట్ల రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తుందని, దానిని అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్మికుల రక్షణకు యాజమాన్యాలు ప్రత్యేక చొరవ చూపాలని, కార్మికుల ఆరోగ్యమే సంస్థ ఆరోగ్యంగా భావించాలని అన్నారు. కర్మాగారాలు, దుకాణాలలో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు తదితర రంగాల కార్మికులు పని ప్రదేశాలలో లభ్యంగా ఉన్న సౌకర్యాల మేరకు స్వీయ రక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్మికుల పని ప్రదేశాలలో తాగు నీరు, నీడ, వసతిని యాజమాన్యాలు కల్పించాలని ఆదేశించారు. పని ప్రదేశాలలో మజ్జిగ. ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, ఐవి ఫ్లూయిడ్స్, అత్యవసర మందులు, గర్భిణి స్త్రీలు, వయసు మీరిన కార్మికుల కోసం మరిన్ని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సహాయం సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో పని వేళలను మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు లేకుండా సమయాలను మార్పులు చేయాలని అన్నారు. డీ హైడ్రేషన్ నివారణ మార్గాలపై కార్మికులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్మికులకు ప్రతి గంట పని తరువాత 5 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలని ఆదేశించారు. గుంటూరు జిల్లాలో ఉష్ణ సూచికపై మండల స్థాయి అంచనాలు మరియు ముందు జాగ్రత్త చర్యలతోపాటు అత్యవసర పరిస్థితులు, సమాచారం కోసం పౌరులు 24/7 పనిచేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) టోల్-ఫ్రీ నంబర్లు: 1070ని సంప్రదించవచ్చని చెప్పారు. తీవ్రమైన వేడి పరిస్థితులలో రియల్ టైమ్ సమాచారం, అత్యవసర సహాయ సూచనలు అందిస్తాయని చెప్పారు.

Author
Share This Article
Leave a review