GUNTUR DISTRICT NEWS: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Karthik
6 Views

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కాలుష్య నియంత్రణ మండలి జిల్లా పర్యావరణ ఇంజనీర్  ఎం.డి. నజీనా బేగం అన్నారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా గుంటూరు ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం, రాష్ట్ర యువజన సేవల శాఖ, స్టెప్ (STEP) స్వశక్తి విభాగం, ఐ.టి.ఐ ప్రభుత్వ కళాశాల సంయుక్తంగా బుధవారం ప్రభుత్వ ఐ.టి.ఐలో నిర్వహించాయి. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి జిల్లా పర్యావరణ ఇంజనీర్ “అవర్ పవర్ – అవర్ ప్లానెట్” థీమ్ తో ప్రపంచ ధరిత్రీ  దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం 1970లో అమెరికాలో ప్రారంభమైందని తెలిపారు. 1970 దశకంలో పరిశ్రమల విస్తరణ, వాహనాల పెరుగుదల, రసాయనాల అధిక వినియోగం వల్ల గాలి, నీరు, నేల కాలుష్యం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని ప్రారంభించారని చెప్పారు. అప్పటి నుండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన పర్యావరణ ఉద్యమంగా మారిందని వివరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మన బాధ్యతను ధరిత్రి దినోత్సవం గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. చెట్లు నాటడం, నీటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి సాధారణ చర్యల ద్వారా భూమిని రక్షించవచ్చని సూచించారు. భూమి మనకు గాలి, నీరు, ఆహారం, నివాసం వంటి మౌలిక అవసరాలను అందిస్తున్నప్పటికీ, మన నిర్లక్ష్యం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని తెలిపారు. అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, నీటి వృథా, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భూమిని కాపాడడం అత్యవసరమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐ.టి.ఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎస్. ఖాజావలి, రాష్ట్ర యువజన సేవల ఇన్‌చార్జ్ బి. రాధిక, పర్యావరణ కోఆర్డినేటర్ డి. తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review