విశాఖలో గూగుల్ ప్రభంజనం! 🌐 ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్!

Bhuvana

విశాఖ గడ్డపై గూగుల్ అడుగుపెట్టబోతోంది! ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌కు ఏపీ వేదిక కాబోతోంది. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో నిర్మించనున్న ‘వైజాగ్ మెగా డేటా పార్క్’కు ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 266 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోబోతున్న ఈ ప్రాజెక్ట్, ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేయబోతోంది.”

“ఈ మెగా ప్రాజెక్ట్ కోసం మౌలిక సదుపాయాల భాగస్వామిగా అదానీ ఇన్ఫ్రా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 266.6 ఎకరాల్లో బిల్డింగ్ ప్లాన్ సిద్ధమైంది. ఇందులో 33 శాతం పార్కింగ్‌కు, దాదాపు 60 ఎకరాలను గ్రీన్ బెల్ట్ కోసం కేటాయించారు. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. గూగుల్ డేటా సెంటర్ నిరంతరాయంగా నడపడానికి వీలుగా గూగుల్‌కు ‘డీమ్డ్ డిస్కమ్’ హోదా కల్పించేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇదే జరిగితే, దేశంలోనే సొంతంగా విద్యుత్ కొనుగోలు చేసి ట్రాన్స్‌మిషన్ లైన్లు ఏర్పాటు చేసుకునే తొలి ప్రైవేటు సంస్థగా గూగుల్ చరిత్ర సృష్టించనుంది.”

“శంకుస్థాపన నేపథ్యంలో తర్లువాడలో ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. జాతీయ రహదారి నుంచి వేదిక వరకు కోటిన్నర రూపాయలతో తాత్కాలిక రోడ్డును సిద్ధం చేశారు. గూగుల్ ప్రతినిధులు, ఐటీ నిపుణులు పాల్గొనే ఈ సభ కోసం భారీ టెంట్లతో వేదికను ముస్తాబు చేశారు. భద్రతా దృష్ట్యా తర్లువాడ ఇప్పటికే పోలీసు నిఘాలో ఉంది. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ డేటా పార్క్ అందుబాటులోకి వస్తే, విశాఖపట్నం గ్లోబల్ ఐటీ హబ్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. ఐటీ రంగంలో ఏపీ నవశకానికి నాంది పలకబోతున్న ఈ చారిత్రక ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది!”

Author
Total Views: 0
Share This Article
Leave a review