GUNTUR DISTRICT NEWS: ఇసుక ధర రూ.130 కు మించకుండా చర్యలు తీసుకోవాలి

Karthik
1 View

పట్టా భూముల్లో ఇసుక వెలికితీత (సెమీ మెకనైజ్డ్ మైనింగ్ పద్ధతిలో) ధర మెట్రిక్ టన్నుకు రూ.130 కు మించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పట్టా భూముల్లో ఇసుక వెలికితీత (సెమీ మెకనైజ్డ్ మైనింగ్ పద్ధతిలో) ధర మెట్రిక్ టన్నుకు రూ.154 వరకు పెంచుటకు అవకాశం ఉందని కమిటీలో ప్రస్తావించగా రూ.130 కు మించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కృష్ణా గోదావరి వాటర్‌వేస్ సంస్థ, తుళ్ళూరు మండలంలోని అబ్బరాజువాలెం/బోరుపాలెం గ్రామం, లింగాయపాలెం & రాయపూడి గ్రామం మరియు తాల్లాయపాలెం గ్రామం సమీపంలో నావిగేషన్ చానల్-4 లో ఇబ్రహీంపట్నం నుండి వైకుంఠపురం/హరిశ్చంద్రపురం వరకు కృష్ణా నదిలో తవ్వకం కార్యకలాపాల వలన 2,27,964 క్యూబిక్ మీటర్లు/3,41,946 మెట్రిక్ టన్నుల తవ్వకం పునరుద్ధరణకు చేసిన దరఖాస్తును 2027 జనవరి 31 వరకు పొడిగింపును కమిటీ ఆమోదించింది. కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం గ్రామంలో 6 గురు వ్యక్తుల పట్టా భూముల నుండి ఇసుక తీయడానికి నిబంధనల మేరకు చట్టబద్ధమైన అనుమతులకు ఆమోదం తెలిపింది. గుండిమేడ ఓపెన్ శాండ్ రీచ్‌లో మెస్సర్స్ జితిన్ మినరల్స్ 26,140 మెట్రిక్ టన్నుల ఇసుక వెలికి తీయుటకు పర్యావరణ అనుమతులు పొందిన అనంతరం మాత్రమే మంజూరు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఇసుక రవాణా వాహనానికి చెల్లించాల్సిన రూ.1.40 లక్షల అద్దెను విడుదల చేయుటకు కమిటీ ఆమోదం తెలిపింది. గనుల శాఖ ఉప సంచాలకులు చంద్ర శేఖర్ మాట్లాడుతూ కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం గ్రామంలో 9.66 హెక్టార్ల విస్తీర్ణంలో సెమీ మెకనైజ్డ్ మైనింగ్ పద్ధతిలో 1,44,900 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకానికి ఒక ఓపెన్ శాండ్ రీచ్‌ను గుర్తించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అదనపు ఎస్పీ రమణమూర్తి, ఉప రవాణా కమిషనర్ కే సీతారామి రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ నజీనా బేగం, తాసిల్దార్లు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review