NTR distric news :కూటమి పాలనలో ‘నట్టేట మునిగిన’ రైతు- జగన్ ప్రభుత్వమే అన్నదాతకు శ్రీరామరక్ష

Sharat
1 View

నందిగామ (ఎన్టీఆర్ జిల్లా):-“రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా నిలిస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాతలను నిండా ముంచేస్తోంది” అని వైకాపా స్టేట్ జాయింట్ సెక్రటరీ మద్దుకూరు సాయిబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం నందిగామలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు.

తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా, ఈ కాలంలో రైతాంగానికి జరిగింది శూన్యమని సాయిబాబు ఆరోపించారు. ముఖ్యంగా నందిగామ నియోజకవర్గంలో పత్తి, వరి, మొక్కజొన్న, పెసలు, శనగలు పండించే రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ పాలనలో ‘భరోసా’.. నేడు ‘దళారీల’ రాజ్యం!

గత జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల (RBKs) ద్వారా రైతులకు విత్తనాలు వేసే దగ్గర నుంచి ఎరువుల వాడకం వరకు శాస్త్రీయమైన సలహాలు, సూచనలు అందేవని సాయిబాబు గుర్తుచేశారు. ఆ నాడు పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసిందని, ఒక్కోసారి ప్రైవేట్ వ్యాపారులు కూడా మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనేలా అప్పట్లో పటిష్ట చర్యలు ఉండేవని పేర్కొన్నారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా తలకిందులైందని, దళారీలకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

పేరుకే ‘CCI’.. కొనే నాథుడే లేడు!

  • పత్తి, మొక్కజొన్న రైతుల ఇక్కట్లు: గత ఏడాది సీసీఐ (CCI) ద్వారా పత్తి కొనుగోలు చేస్తామంటూ బోర్డులకే పరిమితం చేశారని, చివరకు రైతులు మద్దతు ధర కంటే తక్కువకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుని నష్టపోయారని సాయిబాబు తెలిపారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉందన్నారు.
  • కంచికచర్ల మార్కెట్ యార్డులో నిలిచిన కొనుగోళ్లు: కంచికచర్ల, వీరులపాడు పరిధిలో శనగలు, పెసలు, మినుములు కొనే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. గత మూడు నెలలుగా కంచికచర్ల మార్కెట్ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోవడంతో శనగలు, పెసల బస్తాలు లాట్లు లాట్లుగా పేరుకుపోయి దర్శనమిస్తున్నాయని ఆరోపించారు.
  • తుఫాను పరిహారం శూన్యం: ‘మెంత’ తుఫాను వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయినా, కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదని దుయ్యబట్టారు.

“మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు కేవలం అలంకార ప్రాయమేనా?” నందిగామ, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్లు అసలు ఏం చేస్తున్నారని సాయిబాబు ప్రశ్నించారు. ఈ పదవులు కేవలం హోదా కోసం, అలంకారం కోసం తీసుకున్నారా? లేక రైతుల సమస్యలు పరిష్కరించడానికి తీసుకున్నారా? అని నియోజకవర్గ రైతాంగం తీవ్ర అసంతృప్తితో వాపోతోందని ఆయన స్పష్టం చేశారు.

పక్క రాష్ట్రంలో మద్దతు ధర.. ఇక్కడెందుకు లేదు?

పక్కనే ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తుంటే.. ఇక్కడ కేంద్రంలో బీజేపీతో కూటమి కట్టిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీస మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని సాయిబాబు ఎద్దేవా చేశారు.

వైకాపా డిమాండ్:

నందిగామ నియోజకవర్గ పరిధిలో ఉన్న ‘క్రక్స్ బయోటెక్’, ‘సెంటి’ లాంటి రెండు ప్రధాన కంపెనీలకు ఉత్పత్తుల తయారీ కోసం మొక్కజొన్న భారీగా అవసరమవుతుందని సాయిబాబు గుర్తుచేశారు. అధికార పార్టీ నాయకులు వెంటనే స్పందించి, ఆయా కంపెనీలతో మాట్లాడి స్థానిక రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నను మద్దతు ధరకే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన వైకాపా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.

Author
Share This Article
Leave a review