GUNTUR DISTRICT NEWS: రీ సర్వేపై పౌరుల స్పందన మెరుగుపడాలి

Karthik

జిల్లాలో రీ సర్వేపై పౌరుల స్పందన మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ స్పష్టం చేశారు. తహసీల్దార్లు, సర్వేయర్ లు, వి.ఆర్.ఓ లతో రీ సర్వే అంశాలపైన, ప్రజల స్పందనపైనా ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మ్యుటేషన్ వచ్చిన వెంటనే24 గంటలలోగా ఫార్మేషన్ నోటీస్ జెనరేట్ చేయాలన్నారు. పిర్యాదుదారుతో మాట్లాడి, నోటీస్ అందించాలని ఆదేశించారు. రైతులకు ఓటిపి అడుగుతున్నారని, అయితే ఎందుకు అడుగుతున్నారో చెప్పడం లేదని, ఈ పద్ధతి మారాలని స్పష్టం చేశారు. నోటీస్ 24 గంటలలో అందజేయాలని చెప్పారు. పిర్యాదుదారు ఇంటి దగ్గర లేకపోతే వాట్సాప్ చేసి, ఆ విషయాన్ని  తెలియజేయాలన్నారు. 15 రోజుల నోటీస్ కాలంలో రికార్డు పక్కాగా నెలకొల్పాలని, డాక్యుమెంట్ లపై స్పష్టమైన అవగాహన కల్పించి అవసరమగు పత్రాలు తీసుకొని  సమర్పించాలని ఆదేశించారు. పిర్యాదుదారు ఆర్జీని తిరస్కరిస్తే దానికి కారణాలు వీ.ఆర్.ఓ వివరించాలని ఆదేశించారు. పిర్యాదుదారులతోమర్యాదగా ప్రవర్తించాలన్నారు. వీ.ఆర్.ఓ సంతకం ఉండాలని డిజిటల్ అసిస్టెంట్ బలవంతం చేస్తూ జాప్యం చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయని, ఇకపై అటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review